Pakistan: గుజరాత్‌ తీరంలో పాక్‌ పడవలు.. భారత కమాండోల ఎయిర్‌డ్రాపింగ్‌..!

గుజరాత్‌ తీరంలోని సర్‌ క్రీక్‌ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన 11 పాకిస్థాన్‌ పడవలు భారత జలాల్లోకి చొరబడటంతో బీఎస్‌ఎఫ్‌ స్వాధీనం చేసుకొంది.ఈ ఘటన హరామీ నాలా వద్ద చోటు చేసుకొంది. సాధారణ తనిఖీల్లో భాగంగా నిన్న

Updated : 11 Feb 2022 11:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌ తీరంలోని సర్‌ క్రీక్‌ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన 11 పడవలు భారత జలాల్లోకి చొరబడటంతో బీఎస్‌ఎఫ్‌ స్వాధీనం చేసుకొంది. ఈ ఘటన హరామీ నాలా వద్ద చోటు చేసుకొంది. సాధారణ తనిఖీల్లో భాగంగా నిన్న ఒక డ్రోన్‌ కెమెరాను ప్రయోగించి ఆ ప్రాంతంలో తనిఖీలు చేయగా.. మొత్తం 11 పాకిస్థాన్‌ పడవలను గుర్తించారు. అయితే.. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. దీంతో ఈ పడవల ద్వారా పాక్‌ నుంచి భారత్‌లో ఎవరైనా ప్రవేశించారా.. అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మరిన్ని పడవలు దొరికే అవకాశం ఉందని బీఎస్‌ఎఫ్‌ ఐజీ జీఎస్‌ మలిక్‌ పేర్కొన్నారు.

రంగంలోకి కమాండోలు..

రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతంలో పాకిస్థానీలు నక్కి ఉండే అవకాశం ఉన్న ప్రదేశాలను బీఎస్‌ఎఫ్‌ గుర్తించింది. దీంతో నిన్న వాయుసేనకు చెందిన మూడు కమాండో బృందాలను వేర్వేరు చోట్ల ఎయిర్‌ డ్రాప్‌ చేశారు. నిన్న రాత్రి కూడా ఆపరేషన్‌  కొనసాగింది. ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. ఇక్కడ విపరీతమైన చిత్తడి నేలలు, మడ అడవులు, ఆటు-పోట్లు కారణంగా సెర్చ్‌ ఆపరేషన్‌ కఠినంగా మారినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ప్రాంతం అత్యంత కీలకం ఎందుకు..?

భారత్‌లోని గుజరాత్‌ను.. పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతం నుంచి వేరు చేస్తూ ఉన్న 96 కిలోమీటర్ల పొడవైన నీటి పాయను సర్‌ క్రీక్‌ అంటారు. ఇది నేరుగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. భౌగోళికంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. అంతేకాదు.. ఇక్కడ అపారమైన మత్స్య సంపద ఉంది. ఆసియాలో చేపల వేట జరిగే అతిపెద్ద ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. దీంతోపాటు ఇక్కడ చమురు నిక్షేపాలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా భాగాన్ని పాక్‌ తనదిగా చెప్పుకుంటోంది. కానీ. ఇవి భారత్‌ ఆధీనంలో ఉన్నాయి.

1965 యుద్ధానికి ముందు ఇక్కడ ఒక సైనిక ఘర్షణ జరిగింది.  అనంతరం ఒక ట్రైబ్యూనల్‌ను ఏర్పాటు చేయగా.. 1968లో అది తీర్పును వెలువరించింది. పాక్‌ చెప్పుకొంటున్న భూభాగంలో కేవలం 10శాతం మాత్రమే దానికి దక్కింది. ఆ తర్వాత నుంచి దాదాపు డజను సార్లు ఈ సమస్యపై చర్చలు జరిగాయి.

1999లో పాక్‌ విమానాన్ని కూల్చేసిన భారత్‌..

1999లో కార్గిల్‌ యుద్ధం ముగిసిన నెల రోజుల తర్వాత పాక్‌ నౌకాదళానికి చెందిన అట్లాంటిక్‌-91 రవాణా విమానం రాణ్‌ ఆఫ్‌ కచ్‌ వద్ద సరిహద్దుల  సమీపానికి వచ్చింది. భారత రాడార్లు గుర్తించాయి. వెంటనే భారత వాయుసేన 45వ స్క్వాడ్రన్‌కు చెందిన మిగ్‌-21 విమానాలు దానిని వెంటాడాయి. ఆర్‌-60 క్షిపణి సాయంతో దానిని కూల్చివేశాయి. ఈ ఘటనలో ఐదుగురు పాక్‌ నేవీ అధికారులతో సహా 16 మంది చనిపోయారు.  మర్నాడు భారత పాత్రికేయులను తీసుకెళుతున్న హెలికాప్టర్‌పై పాక్‌ కాల్పులు జరిపింది. దీంతో ఆ ప్రయాణాన్ని విరమించుకొన్నారు. పాక్‌ కూడా ఓ విదేశీ బృందాన్ని అట్లాంటిక్‌-91 విమానం కూలిన ప్రదేశానికి తీసుకెళ్లి చూపించింది. తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్‌ కేసు వేసింది. కానీ, ఈ కేసులో భారత్‌కు అనుకూలంగా తీర్పు రావడం పాక్‌కు శరాఘాతంగా మారింది.

స్మగ్లింగ్‌కు మార్గంగా..

మాదక ద్రవ్యాల  అత్యధిక సరఫరా జరిగే ‘బంగారు నెలవంక’(పాక్‌-అఫ్గాన్‌-ఇరాన్‌)కు అత్యంత సమీపంలోనే భారత్‌ ఉంది. అరేబియా సముద్ర మార్గంలో నిర్మానుష్యమైన సర్‌క్రీక్‌ ప్రాంతానికి మాదకద్రవ్యాలు చేరవేయడం తేలిక. పలు మార్లు అధికారులు ఇక్కడ మాదక ద్రవ్యాలను సీజ్‌ చేశారు. కొన్నాళ్ల క్రితం భారత్‌ ఇక్కడ పెట్రోలింగ్‌ హోవర్‌ క్రాఫ్ట్‌లను మోహరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని