BSF: బీఎస్‌ఎఫ్‌ దళాలపై వేర్పాటువాదుల దాడి: ఒక జవాను మృతి

ఈశాన్య భారత్‌లో వేర్పాటువాదులు పేట్రేగిపోతున్నారు. తాజాగా త్రిపురలోని బీఎస్‌ఎఫ్‌ దళాలపై వేర్పాటు వాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా..

Published : 19 Aug 2022 16:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈశాన్య భారత్‌లో వేర్పాటువాదులు పేట్రేగిపోతున్నారు. తాజాగా త్రిపురలోని బీఎస్‌ఎఫ్‌ దళాలపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గత 10 రోజుల వ్యవధిలో భారత దళాలపై ఈశాన్య భారత్‌లో జరిగిన నాలుగో దాడి ఇది.

ఈ ఘటన ఆనంద్‌ బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బంగ్లాదేశ్‌కు సమీపంలోని సిమ్నాపూర్‌ వద్ద ఖంట్లాంగ్‌లో చోటుచేసుకొంది. ఈ ప్రదేశం బంగ్లాదేశ్‌, మిజోరాం, త్రిపుర ట్రైజంక్షన్‌. ఇక్కడ పెట్రోలింగ్‌ పార్టీపై వేర్పాటువాదులు కాల్పులు జరిపారు. దీంతో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూడా ఎదురుదాడి చేశారు. ఈ దాడిలో బీఎస్‌ఎఫ్‌ 144వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గిరీష్‌ కుమార్‌ యాదవ్‌  మృతి చెందారు. భురుసింగ్‌, రాజ్‌కుమార్‌ అనే జవాన్లు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన జవాన్లను హెలికాప్టర్‌లో అగర్తలాకు తరలించారు.

ఈ దాడి వెనుక నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ) హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. గతంలో కూడా త్రిపురలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లపై దాడులు జరిగాయి. గతేడాది ఒక బీఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఒక కానిస్టేబుల్‌ను ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ దళాలు కాల్చి చంపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని