BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏడాదే 4G సేవలు.. త్వరలో 5G స్పెక్ట్రానికి వేలం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) 4జీ సేవలు ఈ ఏడాదే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే, 5జీ సేవలకు సంబంధించి త్వరలోనే వేలం నిర్వహించనున్నామని, ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభమవుతాయని పేర్కొంది.

Published : 26 Mar 2022 01:59 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) 4జీ సేవలు ఈ ఏడాదే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే, 5జీ సేవలకు సంబంధించి త్వరలోనే వేలం నిర్వహించనున్నామని, ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి దేవుశిన్హ్‌ చౌహాన్‌ ఓ ప్రశ్నకు శుక్రవారం సమాధానమిచ్చారు.

5జీ సేవలకు సంబంధించి దేశవ్యాప్తంగా నాలుగు కంపెనీలకు ప్రయోగాల కోసం స్పెక్ట్రమ్‌ కేటాయించామని, త్వరలోనే అవి పూర్తవుతాయని మంత్రి వివరించారు. వేలం ప్రక్రియ కోసం  సిఫార్సులను ఇవ్వాలని ఇప్పటికే ట్రాయ్‌ని ప్రభుత్వం కోరిందని తెలిపారు. త్వరలోనే వేలం ప్రక్రియ నిర్వహిస్తామని, 5జీ సేవలను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

అలాగే, బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఈ ఏడాదే 4జీ సేవలు ప్రారంభించనుందని మంత్రి వివరించారు. ఒకసారి 4జీ అందుబాటులోకి వచ్చాక బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రస్తుతం కేవలం ప్రైవేటు టెలికాం కంపెనీలు మాత్రమే 4జీ సేవలు అందిస్తున్నాయి. వాస్తవానికి 2020 నాటికే 4జీ సేవలను ప్రారంభించాల్సి ఉండగా.. అప్పట్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ దాఖలు చేసిన 4జీ టెండర్‌ను టెలికాం విభాగం (డాట్‌) రద్దు చేసింది. దీంతో ఈ సేవలు ఆలస్యమయ్యాయి. ఇటీవల ట్రాయ్‌ వెలువరించిన డేటా ప్రకారం.. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌కు 11.43 కోట్లమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని