Sonia Gandhi: మోదీ బడ్జెట్‌.. పేదలపై నిశ్శబ్ద పిడుగు..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Union Budget) పేదలపై నిశ్శబ్ద పిడుగువంటిదని కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల విపరీతంగా పెరుగుతోందని.. కానీ, ప్రధాని మోదీ, ఆయన పరివారం మాత్రం విశ్వగురు, అమృత్‌కాల్‌ అంటూ నినాదాలు చేస్తున్నారని విమర్శించారు.

Published : 06 Feb 2023 21:15 IST

దిల్లీ: ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ (Budget 2023) పేదలపై మోదీ ప్రభుత్వం చేసిన నిశ్శబ్ద దాడి అని కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) విమర్శించారు. యూపీఏ హయాంలో చేసిన హక్కుల ఆధారిత చట్టాలను అన్నింటినీ ఈ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. మరోవైపు తమ ప్రియమైన వ్యాపారవేత్తలపై ఆర్థిక కుంభకోణం ఆరోపణలు వస్తున్నప్పటికీ.. విశ్వగురు, అమృత్‌కాల్‌ అంటూ ప్రధాని మోదీ (Narendra Modi), ఆయన మంత్రులు మాత్రం నినాదాలు చేస్తూ పొంగిపోతున్నారంటూ ఓ జాతీయ వార్తా పత్రికకు రాసిన ప్రత్యేక వ్యాసంలో సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు.

పేదలు, మధ్యతరగతి ఖర్చుతో కొందరి మిత్రుల ప్రయోజనం కోసం రూపొందిస్తున్న విధానాలు క్రమంగా దెబ్బతీస్తున్నాయి. నోట్ల రద్దు నుంచి మొదలు అత్యంత చెత్తగా రూపొందించిన జీఎస్టీ చిన్న వ్యాపారులను ఎంతో వేధిస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలు విఫలం కావడంతోపాటు వ్యవసాయం కూడా అలక్ష్యానికి గురయ్యింది. ప్రైవేటీకరణ పేరుతో జాతీయ సంపదను కొందరు ప్రైవేటు వ్యక్తులకు చౌకగా కట్టబెడుతున్నారు. దీంతో నిరుద్యోగం పెరగడంతోపాటు ఎస్సీ, ఎస్టీల పరిస్థితి మరింత దిగజారుతోంది’ అని కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు.

‘కోట్ల మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎల్‌ఐసీ, ఎస్బీఐలలో పొదుపు చేసుకున్న నగదును సన్నిహితుల కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారు. ప్రధానమంత్రికి నచ్చిన, ఆయన ప్రియ మిత్రుల ఆర్థిక కుంభకోణాలు బయటపడుతున్నప్పటికీ.. ప్రధాని, ఆయన మంత్రులు మాత్రం విశ్వగురు, అమృత్‌కాల్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు’ అంటూ కేంద్ర ప్రభుత్వతీరుపై మండిపడ్డారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సంపాదన తగ్గిపోవడం వంటి వాటితో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. 2004-14 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన చట్టాలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేదలపై పిడుగు అంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని