Updated : 31 Jan 2022 12:35 IST

RamNath Kovind: వచ్చే 25 ఏళ్లు పునాదులు పటిష్ఠంగా ఉండేలా.. ప్రభుత్వం కృషి

వ్యాక్సినేషన్‌లో గొప్ప విజయం సాధించాం

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం

దిల్లీ: దేశంలో వచ్చే పాతికేళ్లు పునాదులు పటిష్ఠంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఏ పేదవాడు ఆకలితో అలమటించకూడదనే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. కరోనా మహమ్మారిపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కొనియాడారు. ఏడాదిలోపే 150కోట్ల డోసుల పంపిణీని అధిగమించడం ఒక అద్భుతమైన రికార్డు అని అభివర్ణించారు.

ఈ సందర్భంగా దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటూ, అమరవీరులకు నివాళులర్పించారు. ‘‘ప్రతి భారతీయుడికి స్వాతంత్ర్య అమృతోత్సవ్‌ శుభాకాంక్షలు. దేశ సురక్షిత భవిష్యత్‌ కోసం గతాన్ని గుర్తుతెచ్చుకోవడం, గత స్మృతుల నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సిద్ధాంతాలనే మార్గదర్శక సూత్రాలుగా పరిగణిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తోంది. సబ్‌కా సాత్, సబ్‌ కా వికాస్‌ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోంది’’ అని రాష్ట్రపతి చెప్పుకొచ్చారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలివే..

* కరోనా మహమ్మారిపై భారత పోరాటం స్ఫూర్తిదాయకం. ఈ పోరాటంలో భాగస్వాములైన ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, దేశ పౌరులకు అభినందనలు.

* దేశంలో వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఏడాదిలోపే 150కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశాం. భారత వ్యాక్సిన్లు కోట్ల మంది ప్రాణాలను కాపాడాయి. అర్హులైన 90శాతం కంటే ఎక్కువ మంది మొదటి డోసు తీసుకున్నారు.

* ప్రభుత్వ సున్నిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్య సేవలు అందుతున్నాయి. 8 వేలకు పైగా జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలకే ఔషధాలు ప్రజలకు చేరుతున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు పేదలకు చికిత్సలో సాయం చేశాయి.

* ఏ వ్యక్తీ ఆకలితో అలమటించకూడదనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.

* పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. 23 కోట్ల మంది కార్మికులకు ఈ-శ్రమ్‌ పోర్టల్‌తో అనుసంధానించింది. 2 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు కట్టించింది. 6 కోట్ల ఇళ్లకు తాగునీరు అందిస్తోంది.

* గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో మహిళల పాత్ర మరింత విస్తృతమైంది. 2021-22లో 28లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.65వేల కోట్ల సాయం అందించారు. ప్రధానమంత్రి స్వనిధి యోజనతో వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరింది. ఇప్పటివరకు 28లక్షల మంది వీధి వ్యాపారులు ప్రయోజనం పొందారు.

* 7 మెగా టెక్స్‌టైల్‌ పార్కులతో భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించగలిగింది. ఎంఎస్‌ఎంఈలకు చేయూత కోసం రూ. 3లక్షల కోట్ల రుణాలు అందించింది. 

* ఆత్మ నిర్భర్‌ భారత్‌ సంకల్పానికి రూపం తీసుకొచ్చేందుకు దేశీయ విద్యావిధానంలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది 10 రాష్ట్రాల్లోని 19 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 6 స్థానిక భాషల్లో బోధన చేపట్టనున్నారు.

* ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన ద్వారా రోజుకు 100 కి.మీల రహదారుల నిర్మాణం చేపడుతోంది. ఇప్పటివరకు 36,500 కి.మీల రహదారుల నిర్మాణం పూర్తయ్యింది.

* మహిళా సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది. పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య పెరిగింది. 

* కుమార్తెలు కూడా కొడుకులతో సమానమే. అందుకే యువతుల కనీస వివాహ వయసు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం బిల్లు కూడా తీసుకొచ్చింది. త్రిపుల్‌ తలాక్‌ వ్యవస్థను నిర్మూలించాం.

* జీఎస్‌టీ వసూళ్లు గత కొన్ని నెలలుగా రూ.లక్ష కోట్లకు పైనే ఉంటున్నాయి.

* వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. చిన్న, సన్నకారు రైతులు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఉన్న రైతుల్లో 80శాతం మంది వీరే. అందుకే వీరి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా 11 కోట్లకు పైగా రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

* డిజిటల్‌ ఇండియాకు యూపీఐ విజయవంతమైన ఉదాహరణ. డిజిటల్‌ చెల్లింపులను అంగీకరిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం.

* దేశ భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రక్షణరంగ తయారీలో మేక్‌ ఇన్‌ ఇండియాకు అధిక ప్రాధాన్యమిస్తోంది. డ్రోన్‌ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.

* టోక్యో ఒలింపిక్స్‌లో భారత యువశక్తి సామర్థ్యం చూశాం. అత్యుత్తమ ప్రదర్శనతో భారత్‌ 7 పతకాలు సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో కూడా 19 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని