Bullet train project: బుల్లెట్‌ రైలుకు పచ్చజెండా.. మహా ప్రభుత్వం కీలక అడుగు

ముంబయి- అహ్మాదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌లో (Bullet train project) కీలక ముందడుగు పడింది.

Published : 15 Jul 2022 02:05 IST

ముంబయి: ముంబయి- అహ్మాదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌లో (Bullet train project) కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు భూసేకరణతో పాటు ఉన్న ఇతర అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా  కొలువుదీరిన ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని ప్రభుత్వం ఈ మేరకు అన్ని అనుమతులూ మంజూరు చేసింది. ప్రాజెక్ట్‌కు అన్ని క్లియరెన్సులూ లభించినట్లు మహారాష్ట డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ గురువారం వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌కు ఉద్ధవ్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ ప్రభుత్వం మోకాలడ్డిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో భూసేకరణ జరగకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో బుల్లెట్‌ ప్రాజెక్ట్‌ పనులు ఊపందుకుంటాయని వార్తలు వినిపించాయి. అందుకు అనుగుణంగానే శిందే ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే నిర్ణయం తీసుకుంది.

2017లో అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబెతో కలిసి ప్రధాని మోదీ ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. 508 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ కారిడార్లో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌ కోసం ₹1.10 లక్షల కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ముంబయి- అహ్మదాబాద్‌ మధ్య ప్రయాణానికి ఏడెనిమిది గంటల సమయం పడుతుండగా.. బుల్లెట్‌ రైలు అందుబాటులోకి వస్తే కేవలం రెండు గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని