సరస్సులో కొట్టుకొచ్చిన కరెన్సీ కట్టలు.. అన్నీ ₹2వేల నోట్లే!

ఓ సరస్సులో కరెన్సీ నోట్లు కొట్టుకురావడం స్థానికంగా కలకలం రేపింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాలిథిన్‌ కవర్లో....

Updated : 08 May 2022 11:52 IST

(ఫైల్‌ ఫొటో)

అజ్మేర్‌: రాజస్థాన్‌లోని ఓ సరస్సులో కరెన్సీ నోట్లు కొట్టుకురావడం స్థానికంగా కలకలం రేపింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాలిథిన్‌ కవర్లో కరెన్సీ కట్టల్ని నీటిలోకి విసిరేయడంతో అజ్మేర్‌లోని అనాసాగర్‌ సరస్సులో తేలియాడుతూ కనిపించాయి. శుక్రవారం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే, నీటిలో కొట్టుకొచ్చిన కరెన్సీ కట్టలన్నీ రూ.2వేల నోట్లేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనాసాగర్‌ ఎస్పీ బల్‌దేవ్‌సింగ్ మాట్లాడారు. తమకు సమాచారం రావడంతో పోలీసులు అక్కడి వెళ్లారన్నారు. నీటిపై తేలియాడుతున్న నోట్ల కట్టల్ని స్వాధీనం చేసుకున్నారనీ.. కాకపోతే అవన్నీ తడిసిపోయినట్టు చెప్పారు. దీంతో ఇంకా లెక్కించడం కుదరలేదన్నారు. 

గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కరెన్సీ కట్టల్నీ నీటిలో విసిరేశారనీ.. నోట్లన్నీ ఆరిన తర్వాత లెక్కించనున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ నోట్ల కట్టల్ని నీటిలోకి ఎవరు విసిరేశారో గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే, ఈ నోట్లు నకిలీ అంటూ కొన్ని వార్తలు వినిపిస్తుండగా.. స్థానికులు మాత్రం వాటిపై ఆర్‌బీఐ ముద్ర ఉన్నట్టుగా చెబుతున్నారు. గతేడాది జూన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అనాసాగర్‌ సరస్సు ప్రాంతంలోని రామప్రసాద్‌ ఘాట్‌ వద్ద రూ.200, రూ.500 నోట్లతో కూడిన సంచులు కొట్టుకురావడంతో అప్పట్లో స్థానికులు తమ ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా నీటిలోకి దూకి డబ్బుల కోసం ఎగబడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని