Nitin Gadkari: ఇదే నా హామీ.. 2024 ఆఖరు కల్లా ఆ రోడ్లు అమెరికాను తలపిస్తాయ్‌: గడ్కరీ

Nitin Gadkari: అమెరికాలో రోడ్లు బాగున్నాయంటే అందుకు కారణం అమెరికా ధనిక దేశం అయినందున కాదు.. అక్కడ రోడ్లు బాగున్నాయి గనకే ఆ దేశం సుసంపన్నమైందంటూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు కెన్నడీ చేసిన వ్యాఖ్యలను గడ్కరీ గుర్తు చేశారు.

Published : 22 May 2023 19:09 IST

జైపూర్‌: వచ్చే ఏడాది చివరి నాటికి రాజస్థాన్‌లోని రహదారులు అమెరికాను తలపించేలా ఉంటాయని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari) అన్నారు. తద్వారా రాజస్థాన్‌(Rajasthan) సంతోషకర, సుసంపన్నమైన రాష్ట్రంగా అవతరిస్తుందని వ్యాఖ్యానించారు.  దేశంలోని గ్రామాలను ఆనందంగా ఉంచడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు. హనుమగఢ్‌ జిల్లాలోని పక్క షర్న గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ‘సేతు బంధన్‌’లో భాగంగా రూ.2050 కోట్ల వ్యయంతో ఆరు జాతీయ హైవే ప్రాజెక్టులు, ఏడు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు (ROBs)ల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. అమెరికా రోడ్లు బాగున్నాయంటే అందుకు అమెరికా ధనిక దేశం అయినందు వల్ల కాదని.. రోడ్లు బాగున్నాయి గనకే ఆ దేశం సుసంపన్నదేశమైందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ చెప్పిన మాటల్ని తాను ఎప్పుడూ చెబుతుంటాననన్నారు. మంచి రోడ్లు ఉండటం వల్లే అమెరికా సంపన్నదేశంగా అవతరించిందని గడ్కరీ అన్నారు.

‘‘2024 చివరి నాటికి రాజస్థాన్‌లోని  రోడ్లు అమెరికా రహదారులతో సమానంగా ఉంటాయని నేను హామీ ఇస్తున్నా. ఈ రోడ్ల నిర్మాణం వల్ల రాజస్థాన్‌ సంతోషకర, సుసంపన్న రాష్ట్రంగా మారుతుంది. ప్రభుత్వాలు మారితే సమాజం కూడా మారుతుంది. పేదరికం, ఆకలి, నిరుద్యోగం నుంచి విముక్తి కలగాలి. రైతుల పొలాలకు నీరు రావాలి. యువతకు ఉపాధి కావాలి. దేశంలో దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరగాలి. రైతులు ఆహార ఉత్పత్తులు, ఇంధన ఉత్పత్తులను పెంచడం ద్వారా లక్షాధికారులుగా ఎదగాలి’’ అని గడ్కరీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నిహాల్‌ చంద్‌, రాహుల్‌ కస్వాన్‌, నరేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని