Union Cabinet meeting: అన్నదాతలకు గుడ్‌న్యూస్‌.. పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం

అన్నదాతలకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. వరి సహా పలు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది. 

Updated : 07 Jun 2023 16:40 IST

దిల్లీ: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం(Union Government) శుభవార్త చెప్పింది. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు గాను పలు రకాల పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాకు వెల్లడించారు. క్వింటాల్‌ సాధారణ వరికి మద్దతు ధరను రూ.143 చొప్పున పెంచినట్టు వెల్లడించారు. దీంతో క్వింటాల్‌ సాధారణ వరి రకం ధర రూ.2,183కి చేరింది. అలాగే, గ్రేడ్‌ -ఎ వరికి రూ.163లు పెంచడంతో క్వింటాల్‌ ధర రూ.2203కి పెరిగిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కనీస మద్దతు ధర అధికంగా పెంచినట్టు పీయూష్‌ గోయల్‌ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో ఎంఎస్‌పీ పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 

పెసరకు భారీగా పెంపు..

పెసర పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధరను పెంచారు. గతేడాది క్వింటాల్‌ ధర రూ.7,755లు ఉండగా.. ఈసారి 10.4శాతం పెంచడంతో పెసరకు మద్దతు ధర రూ.8,558కి పెరిగింది. అలాగే, హైబ్రిడ్‌ జొన్న క్వింటాల్‌ రూ.3180, జొన్న(మాల్దండి), రూ.3225, రాగి రూ.3846, సజ్జలు రూ.2500, మొక్కజొన్న రూ.2090, పొద్దుతిరుగుడు(విత్తనాలు) రూ.6760, వేరుశెనగ రూ.6377, సోయాబీన్‌ (పసుపు పచ్చ) రూ.4600, పత్తి(మధ్యస్థాయి పింజ) రూ.6620, పత్తి (పొడవు పింజ) రూ. 7020చొప్పున ఈ సీజన్‌లో ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది.

హుడా సిటీ సెంటర్‌ నుంచి గురుగ్రామ్‌లోని సైబర్‌ సిటీకి మెట్రో అనుసంధానానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 28.50 కి.మీల మేర 27 స్టేషన్ల మీదుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. మంజూరైన తేదీ నుంచి నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5452 కోట్లు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని