PMGJAY: గుడ్‌న్యూస్‌.. ఉచిత రేషన్‌ సరఫరా పొడిగించిన కేంద్రం

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉచిత రేషన్‌ పథకాన్ని మరోసారి పొడిగించింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో......

Updated : 24 Nov 2021 16:05 IST

దిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్‌ పథకాన్ని మరోసారి పొడిగించింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది అమలులోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం (పీఎంజీకేఏవై) గడువును పొడిగిస్టున్నట్టు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. దీంతో ఈ పథకం 2022 మార్చి వరకు అమలు కానుంది. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్‌ పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్రమే భరిస్తూ వస్తోంది.

దేశంలో గతేడాది ఏప్రిల్‌ నుంచి మొదలైన ఈ ఉచిత పంపిణీ పథకం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటున్న తరుణంలో నవంబర్‌ 30 తర్వాత ఉచిత రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని పొడిగించే ప్రతిపాదన ఇంతవరకు లేదని నవంబర్‌ 5న కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఇటీవల వెల్లడించిన తెలిసిందే. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత రేషన్‌ పథకాన్ని మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.  

* గతేడాది కేంద్రం ప్రకటించిన ఈ పథకం ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు  మూడు నెలల పాటు కొనసాగింది. అప్పటికీ కరోనాతో సంక్షోభ వెంటాడుతుండటంతో మరో ఐదు నెలల పాటు (జులై -నవంబర్‌ 2020)వరకు పొడిగించింది. ఆ తర్వాత కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ రావడంతో మరోసారి రెండు నెలల పాటు (మే -జూన్‌ -2021) పొడిగించింది. ఆ తర్వాత మరో ఐదు నెలల పాటు (జూలై నుంచి నవంబర్‌ 2021) వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా మరోసారి 2022 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

అలాగే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేబినెట్‌ నిర్ణయించిందని అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. ఈ చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసినట్టు చెప్పారు. ఈ నెల 29 నుంచి జరగబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని