Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు

దేశంలోకి అక్రమంగా ఆయుధాలను చేరవేసి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను జమ్ము పోలీసులు అడ్డుకున్నారు.

Updated : 18 Aug 2022 14:03 IST

జమ్ము: సరిహద్దుల్లో ఆయుధ డంపు చూపేందుకు తీసుకెళ్లిన ఓ ఉగ్రవాదిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. దేశంలోకి అక్రమంగా ఆయుధాలను చేరవేసి విధ్వంసం సృష్టించేందుకు పాక్‌ చేసిన ప్రయత్నాలను జమ్ము పోలీసులు అడ్డుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్‌ ద్వారా జారవిడిచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయుధాల గురించి సమాచారం ఇచ్చిన ఓ లష్కరే తోయిబా కమాండర్‌ అతి తెలివి ప్రదర్శించగా.. పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి హతమార్చారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం..

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్నియా సెక్టార్‌లో డ్రోన్‌ ద్వారా ఆయుధాలు జారవిడిచిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా కమాండర్‌ మహ్మద్‌ అలీ హుస్సేన్‌ అలియాస్‌ ఖాసిమ్ పేరు బయటికొచ్చింది. డ్రోన్‌ ద్వారా ఆయుధాలు సరఫరాలో హుస్సేన్‌ కీలకంగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు మరో కేసులో జైల్లో ఉన్నాడు. దీంతో బుధవారం పోలీసులు అతన్ని జైలు నుంచి తీసుకెళ్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం అతన్ని పోలీసు రిమాండ్‌కు అప్పగించింది.

విచారణ సమయంలో హుస్సేన్‌ చెప్పిన వివరాల మేరకు పోలీసులు అతడిని తీసుకుని పల్లియన్‌ మండల్‌ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఉగ్రవాదులు డ్రోన్‌ ద్వారా జారవిడిచిన ఓ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్యాకెట్‌లో ఒక ఏకే రైఫిల్‌, ఒక మ్యాగజైన్‌, ఒక పిస్టోల్‌, రెండు పిస్టోల్‌ మ్యాగజైన్లు, రెండు గ్రనేడ్లు, బుల్లెట్లు ఉన్నాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుంటుండగా.. హుస్సేస్‌ ఓ పోలీసు సిబ్బంది నుంచి సర్వీసు రైఫిల్‌ను లాక్కుని కాల్పులు ప్రారంభించాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి అతడిని మట్టుబెట్టారు. ఆ డ్రోన్‌ను పాకిస్థాన్‌ నుంచి ఆపరేట్‌ చేసి సరిహద్దుల్లో ముష్కరులు ఆయుధాలను జారవిడిచినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని