Birbhum killings: ‘బీర్‌భూం’ సజీవదహనాల కేసు.. సీబీఐకి అప్పగింత

పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన ‘బీర్‌భూం’ సామాహిక సజీవదహనాల ఘటనపై కలకత్తా హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు

Updated : 25 Mar 2022 12:26 IST

ఆదేశాలు జారీ చేసిన కలకత్తా హైకోర్టు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన ‘బీర్‌భూం’ సామూహిక సజీవదహనాల ఘటనపై కలకత్తా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై ఏప్రిల్‌ 7వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. 

గత సోమవారం బీర్‌భూం జిల్లాలో బర్షాల్‌ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత భాదు షేక్‌ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే రామ్‌పుర్‌హాట్‌ పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై 8 మంది సజీవ దహనమయ్యారు. భాదు షేక్‌ హత్యతో ప్రత్యర్థు ఇళ్లకు టీఎంసీ కార్యకర్తలు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. 

దీంతో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కోల్‌కతా హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. మరోవైపు ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో ఉన్న సాక్ష్యాలు, ఘటన తీవ్రత దృష్ట్యా ఈ కేసులో రాష్ట్ర పోలీసులు విచారణ జరపలేరని కోర్టు అభిప్రాయపడింది. అందుకే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. కేసుకు సంబంధించిన పత్రాలు, నిందితులను సిట్‌.. సీబీఐకి అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో ఏప్రిల్‌ 7న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు తెలిపిన న్యాయస్థానం.. ఆలోపే సీబీఐ తన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు 22 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేయగా.. స్థానిక టీఎంసీ నాయకుడు అనారుల్‌ హుస్సేన్‌ను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. మరోవైపు బోగ్‌టూయి గ్రామాన్ని సందర్శించి ఫోరెన్సిక్‌ పరీక్షకు అవసరమైన నమూనాలను సేకరించాలంటూ దిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్ లాబొరేటరీని హైకోర్టు ఆదేశించింది. ఈ బృందం త్వరలోనే గ్రామానికి వెళ్లనుంది. 

బీర్‌భూంలో 200 బాంబులు గుర్తింపు..

రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న బోగ్‌టూయి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ హత్యాకాండ వెనుక ఎవరున్నా వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటన తర్వాత బీర్‌భూం జిల్లా వ్యాప్తంగా 200 బాంబులను గుర్తించినట్లు తెలుస్తోంది. మమత పర్యటన తర్వాత ఈ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి ఆయుధాల తనిఖీలు చేశారు. ఇందులో 200 బాంబులను గుర్తించగా.. వాటిని నిర్వీర్యం చేసేందుకు బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని