దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు మద్దతు పెరుగుతోందా..?

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలనే స్వరం పెరుగుతోంది. తాజాగా అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) జరిపిన సర్వేలో పాల్గొన్న వారిలో 67శాతం మంది లాక్‌డౌన్‌కు మద్దతు ఇచ్చినట్లు పేర్కొంది.

Published : 04 May 2021 01:13 IST

వ్యాపార సంఘాల సర్వేలోనూ అదే స్వరం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ.. కేసులతో పాటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలనే స్వరం పెరుగుతోంది. తాజాగా అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) జరిపిన సర్వేలో పాల్గొన్న వారిలో 67శాతం మంది లాక్‌డౌన్‌కు మద్దతు ఇచ్చినట్లు పేర్కొంది. కొవిడ్‌ విలయంతో దేశంలో పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో కొన్నిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి సీఏఐటీ విజ్ఞప్తి చేసింది.

గతకొన్ని వారాలుగా దేశంలో కొవిడ్‌ విజృంభణ తీవ్రమైన నేపథ్యంలో తక్షణమే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ ఖాండేవాల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. లాక్‌డౌన్‌ విధిస్తే గతేడాది చేసినట్లుగానే నిత్యావసర వస్తువులను ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేసేందుకు దేశవ్యాప్తంగా వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఒకవేళ దేశవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్‌ సాధ్యంకాని పక్షంలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనైనా పూర్తిగా లాక్‌డౌన్‌ విధించాలని కోరారు. ఇదే విషయమై 9వేల మందిపై జరిపిన సర్వేలో దాదాపు 78శాతం మంది కొవిడ్‌ తీవ్రత నియంత్రించలేని విధంగా ఉందని అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. ఇక 67.5 శాతం మంది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కే మద్దతు తెలిపినట్లు వెల్లడించారు.

దేశంలో లాక్‌డౌన్‌ విధిస్తే ఎక్కువగా నష్టపోయేది వ్యాపారులమేనని.. అయినప్పటికీ అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్న మహమ్మారిని అదుపులోకి తేవడం తక్షణ అవసరమని సీఏఐటీ సభ్యులు అభిప్రాయడ్డారు. ఒకవేళ దేశంలో లాక్‌డౌన్‌ విధించిన పక్షంలో తాత్కాలికంగా పన్ను మినహాయింపుతో పాటు ఈఎంఐల వసూలును వాయిదా వేసేలా బ్యాంకులకు ఆదేశాలివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

లాక్‌డౌన్‌కు పెరుగుతోన్న మద్దతు..?

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంపై కేంద్ర, రాష్ట్రాలు పరిశీలించాలని భారత అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దేశంలో వైరస్‌ కట్టడికి ప్రస్తుత చర్యలు సరిపోవడం లేదని.. లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని ఈ మధ్యే ఎయిమ్స్‌ డైరెక్టర్‌తోపాటు ఇతర ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు మాత్రం వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేయాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కూడా భారత్‌లో కొద్ది వారాలపాటు లాక్‌డౌన్‌ అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మహమ్మారి పోరులో లాక్‌డౌన్‌ చివరి ఆయుధంగా వాడాలని పేర్కొన్న విషయం తెలిసిందే.

దిలాఉంటే, దేశవ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యం దాదాపు 4లక్షల కేసులు నమోదు కావడంతోపాటు 3వేలకు పైగా కొవిడ్‌ రోగులు మృత్యువాతపడుతున్నారు. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దాదాపు పది రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగిస్తుండగా పలు రాష్ట్రాలు వాటిని ఎప్పటికప్పుడు పొడిగించేందుకే మొగ్గు చూపుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని