Sanjay Raut: ‘సావర్కర్‌’ విషయంలో కాంగ్రెస్‌తో రాజీ పడలేం: సంజయ్‌ రౌత్‌

ప్రతి అంశంలో ఏకీభవించాలని కాంగ్రెస్‌ పార్టీతో తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. సావర్కర్‌ విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు.

Published : 23 Nov 2022 01:06 IST

ముంబయి: హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను శివసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. దీంతో ఈ పార్టీ మధ్య బంధం తెగిపోనుందని వార్తలు వచ్చాయి. దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తాజాగా స్పందించారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నప్పటికీ.. అన్ని విషయాల్లో ఆ పార్టీతో ఏకీభవించలేమని తెలిపారు. సావర్కర్‌, హిందుత్వ వంటి అంశాల్లో తాము ఎప్పటికీ రాజీపడలేమని స్పష్టం చేశారు.

‘‘భారతీయ జనతా పార్టీతో మాకు విభేదాలు ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. అది సజావుగానే సాగింది. ఇప్పుడు మేం భాజపాను వీడాం. కానీ మా సిద్ధాంతాలను కాదు. ప్రతి అంశంలో ఏకీభవించాలని కాంగ్రెస్‌ పార్టీతో మేం ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కొన్ని అంశాల్లో శివసేన ఎప్పటికీ రాజీపడదు. హిందుత్వ, వీర్‌ సావర్కర్‌ లాంటి అంశాలు మా సిద్ధాంతాలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి’’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు.

ఇక, విభేదాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల కోసం కొన్ని బంధాలను కొనసాగించాల్సి ఉంటుందని రౌత్‌ ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీతో శివసేన మైత్రి సుదీర్ఘకాలం కొనసాగుతుందా? అని ప్రశ్నించగా.. దేశానికి అవసరమైతే తప్పకుండా ఉంటుందని తెలిపారు. ‘‘ప్రజాస్వామ్యం, ప్రజల స్వేచ్ఛ, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మేం మా విభేదాలను పక్కనబెట్టి చేతులు కలిపాం’’ అని రౌత్‌ వివరించారు.

‘భారత్‌ జోడో యాత్ర’లో భాగంగా వాసిం జిల్లాలో నిర్వహించిన ఓ సభలో రాహుల్‌ గాంధీ సావర్కర్‌పై విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీకీ, ఆరెస్సెస్‌కు ఆయనో చిహ్నమని పేర్కొన్నారు. అండమాన్‌ జైల్లో 2-3 ఏళ్ల పాటు ఉన్న సావర్కర్‌.. క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్‌ వారికి అర్జీలు పెట్టుకున్నారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను శివసేన నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత శివసేన అధికార పత్రిక సామ్నాలో రాహుల్‌ వ్యాఖ్యలను విమర్శిస్తూ సంజయ్‌ రౌత్‌ సంపాదకీయం రాశారు.

ఇదిలా ఉండగా.. భారత్‌ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్‌ గాంధీ.. ఆదివారం రౌత్‌కు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో సంతోషపడిన శివసేన ఎంపీ.. రాహుల్‌పై ప్రశంసలు కురిపించారు. రాహుల్‌జీ చర్య అభినందనీయమని, రాజకీయ సమరంలో ఇలాంటివి చాలా అరుదుగా కన్పిస్తాయని కొనియాడారు. పాత్రాఛల్‌ కుంభకోణం కేసులో ఇటీవల జైలు నుంచి విడుదలైన రౌత్‌.. ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్‌ పెద్దలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని