Canada Singer: ‘భారత్‌ నా దేశం కూడా..!’: టూర్‌ రద్దుపై కెనడా సింగర్‌ శుభ్‌

Canada Singer Shubh: దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తన భారత పర్యటన రద్దవ్వడంపై కెనడాలో ఉంటున్న పంజాబీ సింగర్‌ శుభ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘భారత్‌ నా దేశం కూడా..!’ అంటూ పోస్ట్‌ పెట్టాడు. 

Updated : 22 Sep 2023 10:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు (India Canada Diplomatic Row) కొనసాగుతున్న వేళ కెనడాలో ఉంటున్న పంజాబీ గాయకుడు శుభ్‌నీత్‌ సింగ్‌ (Rapper Shubhneet Singh) ఇండియా టూర్‌ రద్దయ్యింది. ఖలిస్థానీ ఉద్యమానికి శుభ్‌ మద్దతు పలుకుతున్నట్లు ఆరోపణలు రావడంతో అతడిపై దేశంలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే త్వరలో జరగాల్సిన అతడి భారత టూర్‌ను స్పాన్సరర్లు రద్దు చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన శుభ్‌ తాజాగా సామాజిక మాధ్యమాల్లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టాడు. తానూ భారత్‌లోనే జన్మించానని, పర్యటన రద్దవ్వడం చాలా బాధించిందని పేర్కొన్నాడు.

‘‘పంజాబ్‌కు చెందిన ఓ యువ ర్యాపర్‌-సింగర్‌గా.. నా మ్యూజిక్‌ను ప్రపంచ వేదికలపై ప్రదర్శించాలనుకోవడం నా కల. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు నన్నెంతగానో కుంగదీశాయి. నా ఇండియా టూర్‌ రద్దవ్వడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. భారత్‌ నా దేశం కూడా..! నేనూ ఇక్కడే జన్మించా. నా గురువులు, నా పూర్వీకులు అంతా ఇక్కడే ఉన్నారు. నా దేశంలో నా ప్రజల ముందు ప్రదర్శన ఇవ్వాలని ఎంతో ఉత్సాహపడ్డా. కానీ, అది జరగట్లేదు. నాపై వచ్చిన ఆరోపణలు నన్నెంతో బాధించాయి. అయితే వీటికి నేను భయపడను’’ అని శుభ్‌ తన ఇన్‌స్టా పేజీలో రాసుకొచ్చాడు.

కెనడాపై కఠిన భారత్‌ వైఖరి: ఆ దేశ పౌరులకు వీసాల జారీ నిలిపివేత

పంజాబ్‌కు చెందిన గాయకుడు, నటుడు రన్‌వీత్‌ సింగ్‌ సోదరుడైన 26 ఏళ్ల శుభ్‌నీత్‌ (Shubhneet Singh) కొన్నేళ్ల క్రితం కెనడా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అక్కడి నుంచే తన ర్యాప్‌ సింగింగ్‌ జర్నీని ప్రారంభించాడు. ర్యాప్‌లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అతడు.. తన తొలి భారత్‌ టూర్‌ను ప్రకటించాడు. అయితే, ఇటీవల అతడు ఖలిస్థానీ ఉద్యమానికి మద్దతిస్తూ భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని అభ్యంతరకర ఫొటోలు పెట్టాడు. దీంతో అతడిపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దేశ వ్యతిరేక శక్తులకు అనుకూలంగా ఉన్నందున అతడి ప్రదర్శలను అడ్డుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే భారత్‌లో అతడి పర్యటన రద్దయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ వివాదం నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ, కేఎల్ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, సురేశ్ రైనా తదితర క్రికెటర్లు శుభ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని