ఉద్యోగ పరీక్షలో కుందేలు-తాబేలు ఘటన.. రేసులో ముందున్నానని నిద్రపోయి..

‘మన మీద మనకు నమ్మకం ఉండాలి. కానీ, అతి విశ్వాసం పనికిరాదు’ అనేది అక్షరాలా నిజం అని చెప్పే ఉదంతమిది. పరీక్షలో అందరికంటే ముందున్న ఓ అభ్యర్థి.. చేజేతులా తన ఉద్యోగ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది..? అతడేం చేశాడు..?

Published : 29 Mar 2023 18:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుందేలు-తాబేలు (Hare and Tortoise Story)  కథ వినే ఉంటారుగా..! సరిగ్గా ఇలాంటి ఘటనే నిజజీవితంలోనూ జరిగింది. ఓ నియామక పరీక్షకు సంబంధించిన ఫిజికల్‌ టెస్టులో అందరికంటే ముందంజలో ఉన్న ఓ అభ్యర్థి.. గెలిచేస్తానన్న అతివిశ్వాసంతో మధ్యలో విశ్రాంతి తీసుకుని ఓ కునుకేశాడు. తీరా లేచే సరికి ఆ పరీక్షే పూర్తయిపోయింది. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో జరిగిందీ ఆశ్చర్యకర ఘటన. అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా ప్రాంతంలో 38 ఫారెస్ట్ రేంజర్‌ (Forest Ranger) పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టారు. ఇందుకు సంధించిన పరీక్షకు 114 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఫిజికల్‌ టెస్టులో పాసైతేనే పరీక్షకు అర్హత సాధిస్తారు. అయితే అది చాలా క్లిష్టమైన పరీక్ష. అటవీ ప్రాంతంలో నాలుగు గంటల్లో 24 కిలోమీటర్ల హైకింగ్‌ పూర్తిచేయాలి. మార్చి 28న నిర్వహించిన ఈ ఫిజికల్‌ టెస్టుకు రాష్ట్రవ్యాప్తంగా 61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో గ్వాలియర్‌కు చెందిన పహద్‌ సింగ్‌ (Pahad Singh) అందరికంటే ముందుగా ఉన్నాడు.

మిగతా అభ్యర్థుల కంటే చాలా వేగంతో వెళ్లడంతో విజయానికి దాదాపు చేరువయ్యాడు. అక్కడే అతడి అతివిశ్వాసం కొంపముంచింది. ఎలాగూ రేసు గెలిచేస్తానన్న ధీమాతో పహద్‌.. మధ్యలో కాసేపు విశ్రమించాడు. ట్రాక్‌ను వదిలి పక్కకు వెళ్లి నిద్రపోయాడు. ఉదయం 6.30 గంటలకు ఈ టెస్టు మొదలవ్వగా.. 10.30 గంటలకు ముగిసింది. అయితే 60 మంది అభ్యర్థులే ఫినిషింగ్‌ లైన్‌ దాటడంతో పహద్‌ సింగ్‌ మిస్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అతడి కోసం ఓ బృందం అడవిలో గాలించగా.. చివరి చెక్‌ పాయింట్‌కు ముందు ట్రాక్‌ పక్కన నిద్రిస్తూ కన్పించడంతో అధికారులు అవాక్కయ్యారు. అతడిని లేపి అసలు విషయం చెప్పడంతో పహద్‌ కంగుతున్నాడు. కాళ్లు బొబ్బలెక్కడంతో కాసేపు విశ్రాంతి తీసుకున్నానని.. ఎప్పుడు గాఢ నిద్రలోకి వెళ్లానో తనకే తెలియదని పహద్‌ అధికారులతో చెప్పాడు. ఏదేమైనా.. అతి విశ్వాసంతో అతడు ఓ మంచి అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని