కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్ చూపిస్తేనే..ఈసీ ఆదేశం

దేశంలో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో..ఎన్నికల సంఘం (ఈసీ)బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Published : 28 Apr 2021 18:24 IST

దిల్లీ: దేశంలో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ఎన్నికల సంఘం (ఈసీ)బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన లేక కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు విజేతలు ఎలాంటి ప్రదర్శనలు చేపట్టడానికి వీల్లేదంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసోం, తమిళనాడు, కేరళ, పశ్చిమ్‌బెంగాల్ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో నమోదైన ఓట్లను మే 2న లెక్కించనున్నారు. 

మే 2(ఆదివారం)న లెక్కింపు కేంద్రాల బయట ఈసీ బహిరంగ సభలను నిషేధించింది. అభ్యర్థులు, వారి ఏజెంట్లు నెగిటివ్ ఆర్టీపీసీఆర్ లేక ర్యాపిడ్ యాంటీజెన్ రిపోర్టును చూపిస్తేనే కేంద్రం లోపలికి అనుమతి ఉంటుంది. అవి కాకపోతే కరోనా టీకా రెండు డోసుల పొందిన ధ్రువ పత్రాన్ని అయినా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదికలు లెక్కింపు ప్రారంభించడానికి కనీసం 48 గంటల ముందు పొందినవై ఉండాలని ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే అభ్యర్థులు లెక్కింపు రోజుకు మూడు రోజుల ముందు ఏజెంట్ల జాబితాను అందించాల్సి ఉంటుందని తెలిపింది.

ఇదిలా ఉండగా..పశ్చిమ్ బెంగాల్‌లో రేపు చివరి దశ పోలింగ్ జరగనుంది. అలాగే కొవిడ్‌ వేళ నిర్వహించిన ఈ శాసనసభ ఎన్నికల ప్రచారంలో..నిబంధనలు విస్మరించడంపై అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో గతవారమే భారీ ప్రచార సభలపై ఈసీ ఆంక్షలు విధించింది. మరోవైపు, ఈసీ వైఖరిపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. రెండో దశలో కరోనా ఉద్ధృతికి ఈసీదే బాధ్యత అంటూ తప్పుపట్టింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని