Hathras Stampede: హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటీ? సిట్‌ నివేదిక ఏం చెప్పిందంటే..!

Hathras Stampede: సంచలనం సృష్టించిన హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనపై సిట్‌ నివేదిక సమర్పించింది. ఇందులో కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని పేర్కొంది.

Published : 09 Jul 2024 15:35 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట (Hathras Stampede) ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విస్తృత విచారణ జరిపింది. ఆ నివేదికను మంగళవారం యూపీ (Uttar Pradesh) ప్రభుత్వానికి సమర్పించింది. తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యత అని, స్థానిక యంత్రాంగం కూడా ఉదాసీనంగా వ్యవహరించిందని సిట్‌ పేర్కొంది.

‘‘తొక్కిసలాట ఘటన (Hathras Stampede)పై ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా.. ప్రమాదానికి ఈవెంట్‌ ఆర్గనైజర్ల నిర్వహణ వైఫల్యమే కారణమని ప్రాథమికంగా తెలిసింది. వాస్తవాలను దాచిపెట్టి నిర్వాహకులు సత్సంగ్‌ కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారు. షరతులు పాటించలేదు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలను ఆహ్వానించి.. వారికి కనీస ఏర్పాట్లు చేయలేదు. ఎలాంటి పోలీసు వెరిఫికేషన్‌ లేకుండానే వాలంటీర్లను నియమించుకున్నారు. భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా లేవు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వారు బయటకు వెళ్లేందుకు బారికేడ్లు కూడా పెట్టలేదు. ప్రమాదం జరగ్గానే నిర్వాహకుల కమిటీలోని సభ్యులు అక్కడినుంచి పారిపోయారు’’ అని సిట్‌ (SIT Report) తన నివేదికలో వెల్లడించింది.

అటు స్థానిక పోలీసులు, యంత్రాంగం కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదని సిట్‌ తెలిపింది. సత్సంగ్‌ (Satsang) జరిగే వేదిక ప్రాంగణాన్ని తనిఖీ చేయకుండా.. కనీసం సీనియర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సబ్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ ఆ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చారని సిట్‌ తెలిపింది. సర్కిల్‌ ఆఫీసర్‌, రెవెన్యూ అధికారి, ఇన్‌స్పెక్టర్‌, ఔట్‌పోస్ట్‌ ఇన్‌ఛార్జ్‌ అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపింది. వీరిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేసింది. అయితే, ఈ ఘటనలో కుట్ర కోణాన్ని కూడా తాము కొట్టిపారేయలేమని, దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సిట్‌ అభిప్రాయపడింది. ఈ నివేదిక ఆధారంగా యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానిక సబ్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌, సర్కిల్‌ అధికారితో పాటు మరో నలుగురిని మంగళవారం సస్పెండ్ చేసింది.

జులై 2న ఈ దుర్ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. హాథ్రస్‌ జిల్లా సికంద్రరావ్‌ ప్రాంతం ఫుల్‌రయీ, ముగల్‌గఢీ గ్రామాల మధ్యలోని రహదారిని ఆనుకొని ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 80 వేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే 2.5 లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు తేలింది. భోలే బాబా వెళ్తుండగా ఆయన దర్శనం కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగి 121 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటివరకు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని