రాహుల్‌ కారణంగా.. మేం ‘గాంధీ’ పేరున్న వారిని నిందించట్లేదు కదా..: రిజిజు

రాహుల్‌ ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా మాట్లాడారని, తాము గాంధీ ఇంటిపేరున్న వారందరినీ నిందించట్లేదని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. మోదీ ‘ఇంటిపేరు’పై వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్‌కు శిక్షపడటంపై విపక్షాలు చేస్తోన్న విమర్శలకు రిజిజు బదులిచ్చారు.

Published : 24 Mar 2023 16:54 IST

దిల్లీ: ప్రధాని మోదీ ఇంటిపేరుతో కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గానూ కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించటం.. దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కేంద్ర ప్రభుత్వం తమకు ప్రత్యర్థులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) ట్విటర్‌ వేదికగా స్పందించారు. రాహుల్‌లాగా.. తాము కూడా గాంధీ ఇంటి పేరు ఉన్నవారందరి పైనా నిందలు వేయడం లేదు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

‘‘కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తన వ్యాఖ్యలతో దేశ ప్రజాస్వామ్యాన్ని, సాయుధ దళాలను, దేశ సంస్థలను, ఓబీసీ కమ్యూటినినీ కించపరుస్తున్నారు. అలా అని మేం గాంధీ ఇంటిపేరు ఉన్న ప్రతి ఒక్కరిని నిందిచట్లేదు కదా. ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలుగుతోంది. అయినా ఆ పార్టీ నేతలు ఆయనకు మద్దతుగా నిలవటం ఆశ్చర్యకరం’ అంటూ రిజిజు (Kiren Rijiju) ఎద్దేవా చేశారు. 

2019లో రాహుల్ ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో.. ప్రధానిని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇంటి పేరును కించపర్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు