ఆమెది ప్రేమ.. అతడిది త్యాగం: వీరుడి భార్య కన్నీటి ప్రేమ కథా దృశ్యం..!

అమితమైన ప్రేమ, అంతులేని బాధ, వెలకట్టలేని త్యాగం.. కలగలిపి ఈ దృశ్యం. దీని వెనుక కన్నీటి కథ తెలిస్తే ప్రతి హృదయం ద్రవిస్తుంది. 

Updated : 06 Jul 2024 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతనితో తొలి చూపులోనే ప్రేమలో పడిందామె..! నూరేళ్ల జీవితాన్ని అందంగా ఊహించుకుంటూ అతడితో ఎనిమిదేళ్ల ప్రణయాన్ని శాశ్వత బంధంగా మలుచుకుంది. వీరి ముచ్చట చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో.. పెళ్లయిన నాలుగు నెలలకే అతడి నిండు జీవితాన్ని అగ్నికీలల రూపంలో బలితీసుకుంది. ఇది విన్న ఆమె గుండె ముక్కలైంది. అయినా ఆ బాధను పంటిబిగువన పట్టి.. దేశం కోసం భర్త చేసిన త్యాగాన్ని తలుచుకుని గర్వించింది. ఉబికివస్తున్న కన్నీళ్లను కంటిపొరల్లోనే దాచుకుని ఆ అమరుడికి అందిన పురస్కారాన్ని సగర్వంగా స్వీకరించింది. రాష్ట్రపతి భవన్‌లో కన్పించిన ఈ దృశ్యం ప్రతి ఒక్కరి మనసుల్ని మెలిపెట్టింది.

విధి నిర్వహణలో విశేష శౌర్య, పరాక్రమాలు ప్రదర్శించిన ఆర్మీ, పారామిలిటరీ సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం కీర్తి చక్ర, శౌర్య చక్ర  పురస్కారాలను ప్రదానం చేశారు. మరణానంతరం కెప్టెన్‌ అంశుమన్‌ సింగ్‌ (Captain Anshuman Singh)కు లభించిన కీర్తి చక్ర (Kirti Chakra) పురస్కారాన్ని ఆయన భార్య స్మృతి సింగ్‌, తల్లి అందుకున్నారు. అవార్డు స్వీకరించే సమయంలో సింగ్‌ సేవల గురించి చెబుతుండగా స్మృతి ఉద్వేగానికి లోనయ్యారు. చెమర్చిన కళ్లతో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అవార్డు స్వీకరించిన అనంతరం అంశుమన్‌తో తన ప్రేమ గురించి స్మృతి (Smriti Singh) పంచుకున్నారు. అది ఆమె మాటల్లోనే..

‘‘‘నాకు సాధారణ మరణం వద్దు.. గర్వంతో నా ఛాతీ ఉప్పొంగుతుండగా తుది శ్వాస విడవాలి’ అని నా భర్త ఎప్పుడూ చెబుతుండేవాడు. కాలేజీ ఫస్ట్‌ డే రోజున మేం తొలిసారి కలిశాం. జీవితం సినిమాటిక్‌గా ఉంటుందని అనుకోను. కానీ అతడిని చూడగానే తొలి చూపులోనే ప్రేమలో పడ్డా. నెల తర్వాత అతడు సాయుధ దళాల మెడికల్‌ కాలేజీకి సెలెక్ట్‌ అయ్యాడు. అయినా మా ప్రేమ ఆగిపోలేదు. ఎనిమిదేళ్ల పాటు ఒకరినొకరం అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. 2023 ఫిబ్రవరిలో మా వివాహం జరిగింది. దురదృష్టం ఏంటంటే.. పెళ్లయిన రెండు నెలలకే అతడికి సియాచిన్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. గతేడాది జులై 18న మేమిద్దం చివరిసారిగా చాలాసేపు ఫోన్‌లో మాట్లాడుకున్నాం. 50ఏళ్ల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని కలలు కన్నాం. సొంతిళ్లు, పిల్లలు ఎన్నో ఊహించుకున్నాం. ఆ మరుసటి రోజు ఉదయమే అతడు లేడన్న వార్త వచ్చింది. అది నమ్మడానికి నా మనసు ఇప్పటికీ అంగీకరించడం లేదు. ఇప్పుడు అతడి కీర్తి చక్ర నా చేతిలో ఉంది. బహుశా అతడు ఇక రాడన్నది నిజమేనేమో..! నా భర్త ఓ హీరో. మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా ఎన్నో కుటుంబాలను రక్షించాడు’’ అంటూ స్మృతి సింగ్‌ భావోద్వేగానికి గురయ్యారు.

ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌ డాక్టర్‌, 26వ బెటాలియన్‌ పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్‌ అంశుమన్‌ సింగ్‌ గతేడాది జులై 19న విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. సియాచిన్‌లో వారు ఉంటున్న బేస్‌ క్యాంప్‌లో తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న జవాన్లను కెప్టెన్‌ ధైర్యంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు. అగ్నికీలలు పక్కనే ఉన్న మెడికల్‌ ఇన్విస్టిగేషన్‌ రూమ్‌కు వ్యాపిస్తుండగా వాటిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తూ తీవ్ర గాయాలపాలై మరణించారు. ఆయన శౌర్యానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని