Mahua Moitra: ఎన్సీడబ్ల్యూ ఫిర్యాదు.. ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 07 Jul 2024 20:10 IST

దిల్లీ: జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మపై (Rekha Sharma) ‘ఎక్స్‌’ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై (Mahua Moitra) పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్సీడబ్ల్యూ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 79 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అందులో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు రేఖాశర్మ బాధితుల ఇళ్లకు వెళ్లారు. ఆ సమయంలో వర్షం పడటంతో పక్కనున్న వారు ఆమెకు గొడుగుపట్టారు.

దీనికి సంబంధించిన వీడియోను మొయిత్రా గురువారం ‘ఎక్స్‌’లో పోస్టు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని సుమోటోగా తీసుకొని ఆమెను అరెస్టు చేయాల్సిందిగా జాతీయ మహిళా కమిషన్‌ శుక్రవారం డిమాండ్‌ చేసింది. ఆ తర్వాత  కూడా మొయిత్రా ఏమాత్రం తగ్గకుండా.. ఎన్సీడబ్ల్యూ పోస్టుకు దిల్లీ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ.. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని నడియా జిల్లాలో ఉన్నానని మూడు రోజుల్లోగా వచ్చి అరెస్టు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘నా గొడుగు నేను పట్టుకోగలను’ అంటూ రేఖాశర్మను ఉద్దేశించి అన్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడం గమనార్హం.

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో మహువా మొయిత్రా (Mahua Moitra) గత లోక్‌సభలో బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణానగర్‌ (నడియా నార్త్‌) లోక్‌సభ నియోజకవర్గం నుంచి 50 వేల పైచిలుకు ఓట్లతో ఆధిక్యంతో ఆమె గెలుపొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని