Mumbai: కౌంటింగ్‌ వేళ ఈవీఎం అన్‌లాక్‌ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్‌

ముంబయిలోని గోరెగావ్ ప్రాంతంలోని కౌంటింగ్ సెంటర్‌లో ఈవీఎంను అన్‌లాక్ చేయడానికి వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) కోసం ఫోన్ వాడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగేష్ పాండిల్కర్‌ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Published : 16 Jun 2024 19:00 IST

ముంబయి: ముంబయి వాయువ్య లోక్‌సభ స్థానానికి కొత్తగా ఎన్నికైన ఎంపీ రవీంద్ర వైకర్ (Ravindra Waikar) బావమరిది మంగేష్ పాండిల్కర్‌(Mangesh Pandilkar)పై పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 4న కౌంటింగ్ జరుగుతున్న సెంటర్‌లో మొబైల్ ఫోన్‌ను ఉపయోగించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 

ముంబయిలోని గోరెగావ్(Goregaon) ప్రాంతంలో ఉన్న కౌంటింగ్ సెంటర్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)ని అన్‌లాక్ చేయడానికి వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) కోసం మంగేష్ ఫోన్ వాడినట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయనకు మొబైల్ ఫోన్ ఇచ్చినందుకు ఎన్నికల కమిషన్ ఉద్యోగిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన రవీంద్ర వైకర్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన అమోల్ గజానన్ కీర్తికర్‌పై కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫలితాలపై తమ పార్టీకి అనుమానాలు ఉన్నాయని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆరోపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఫలితాలు వెలువడిన తర్వాత ఈ స్థానం నుంచి పోటీ చేసిన పలువురు అభ్యర్థులు కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని పోలీసులను, ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈవీఎంను అన్‌లాక్ చేయడానికి అవసరమయ్యే ఓటీపీని జనరేట్ చేసే ఫోన్ పోల్ ఆఫీసర్ దినేష్ గురవ్ వద్ద ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.నిబంధనల ప్రకారం ఫోన్‌ను ఎన్నికల అధికారి ఉపయోగించాల్సి ఉంటుందని, నిబంధనలను అతిక్రమించి మంగేష్ ఆ ఫోన్‌ను ఉపయోగించారన్నారు. ఫోన్ నుంచి కాల్స్ కూడా చేసినట్లుగా ఆయన అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ముంబయి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఓటీపీ కోసం వినియోగించిన మొబైల్ ఫోన్‌లోని కాల్ రికార్డ్‌లను పరిశీలిస్తున్నామన్నారు. సీజ్ చేసిన ఫోన్‌కు ఎన్ని కాల్స్, ఓటీపీలు వచ్చాయి అనే విషయాలను విచారించనున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని