Gauri Khan: రియల్‌ ఎస్టేట్‌ వివాదంలో.. షారుక్‌ భార్యపై కేసు నమోదు

ఓ ఆస్తి వివాదంలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులతోపాటు ఆ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్‌ అగ్రనటుడు షారుక్‌ఖాన్‌ సతీమణి గౌరీఖాన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు యూపీ పోలీసులు గురువారం వెల్లడించారు.

Published : 03 Mar 2023 07:10 IST

లఖ్‌నవూ: ఓ ఆస్తి వివాదంలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులతోపాటు ఆ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్‌ అగ్రనటుడు షారుక్‌ఖాన్‌ సతీమణి గౌరీఖాన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు యూపీ పోలీసులు గురువారం వెల్లడించారు. ‘తుల్సియానీ బిల్డర్స్‌’ చీఫ్‌ ఎండీ అనిల్‌కుమార్‌ తుల్సియానీ, డైరెక్టర్‌ మహేశ్‌ తుల్సియానీలతోపాటు గౌరీఖాన్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుశాంత్‌ గోల్ఫ్‌సిటీ పోలీస్‌స్టేషనులో ఫిబ్రవరి 25న కిరీట్‌ జస్వంత్‌ షా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గౌరీఖాన్‌ ప్రచారం కారణంగా తుల్సియానీ బిల్డర్స్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నుంచి 2015లో తాను రూ.85.46 లక్షలకు ఓ ఫ్లాటు కొనుగోలు చేశానని.. దాన్ని 2016లోగా అప్పగించాల్సి ఉందని అందులో తెలిపారు. గడువులోగా ఫ్లాటును అప్పగించకపోవడంతో 2017లో తనకు రూ.22.70 లక్షల పరిహారం ఇచ్చారని.. మరో ఆరు నెలల్లో ఫ్లాటును అప్పగించకపోతే మిగతా సొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారని పేర్కొన్నారు. తనకు హామీ ఇచ్చినట్లుగా సొమ్మును అనిల్‌కుమార్‌ తుల్సియానీ, మహేశ్‌ తుల్సియానీ తిరిగివ్వలేదని.. పైగా తన ఫ్లాటును విక్రయించేందుకు మరొకరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ఐపీసీ 409 (నేరపూర్వక విశ్వాస ఉల్లంఘన) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని.. దర్యాప్తు కొనసాగుతోందని అదనపు పోలీస్‌ కమిషనర్‌ స్వాతీ చౌదరి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని