Covid విజేతలపై ‘బ్లాక్‌ ఫంగస్‌’ పంజా..!

కొవిడ్‌ నుంచి కోలుకొన్న వారిని బ్లాక్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ భయపెడుతోంది. ఇటీవల కాలంలో బ్లాక్‌ ఫంగల్‌ కేసులు పెరిగిపోతున్న దిల్లీ, పుణే, అహ్మదాబాద్‌ల్లోని వైద్యులు గుర్తించారు. గతంలో కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌

Updated : 07 May 2021 15:27 IST

 ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ నుంచి కోలుకొన్న వారిని బ్లాక్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ భయపెడుతోంది. ఇటీవల కాలంలో బ్లాక్‌ ఫంగల్‌ కేసులు పెరిగిపోతున్నట్లు దిల్లీ, పుణె, అహ్మదాబాద్‌ల్లోని వైద్యులు గుర్తించారు. గతంలో కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌ సమయంలో కూడా కోలుకొన్న వారిలో కొందరిని ఈ ఇన్ఫెక్షన్‌ సోకింది. తాజా మళ్లీ ఈ రకమైన కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దిల్లీలోని గంగారామ్‌ ఆసుపత్రిలో గత రెండు రోజుల్లో ఇటువంటివి ఆరు కేసులను గుర్తించినట్లు ఈఎన్‌టీ సర్జన్‌ మనీష్‌ ముంజల్‌ తెలిపారు. గుజరాత్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో ఈ కేసులను గుర్తించారు. 

ఏమిటీ ఫంగస్‌..?

‘మ్యూకోర్‌మైసిస్‌’గా పిలిచే ఈ ఫంగస్ సోకితే రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. దీనిని బ్లాక్‌ ఫంగస్‌ అని కూడా అంటారు. ఇవి వాతావరణలో సహజంగానే ఉంటాయి. ఇది మనుషులకు అరుదుగా సోకుతుంటుంది. ముఖ్యంగా కొవిడ్‌ సోకిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి.. లేదా ఇమ్యూనిటీ వ్యవస్థ తీవ్రంగా స్పందించకుండా ఉపయోగించే స్టెరాయిడ్స్‌ వినియోగించిన వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. అవయవ మార్పిడి జరిగిన వారిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారిలో కూడా ఇది సోకే ముప్పు ఎక్కువ.  గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లో, సైనస్‌ వద్ద  చేరతాయి. కొన్ని సందర్భాల్లో శరీరాలకు అయిన గాయాల నుంచి కూడా లోపలకు చేరతాయి.  

లక్షణాలు ఏమిటీ..?

ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం ఇది సోకిన వారిలో దాదాపు సగం మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది సోకిన వారిలో మూడోవంతు మంది చూపు కోల్పోతున్నారు. కొంత మందిలో ముఖం వాపు, ముక్కు ఒక వైపు పూర్తిగా మూసుకుపోయినట్లు ఉండటం, కళ్ల వాపు వంటి లక్షణాలు, కీలక పరీక్షల్లో అవయవాల్లో నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. వెంటనే బయాప్సీ పరీక్షలు నిర్వహించి నిర్ధారిస్తారు.  ముఖ్యంగా తీవ్రమైన డయాబెటిక్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొవిడ్‌ నుంచి కోలుకొనేందుకు వైద్యులు స్టెరాయిడ్‌ ఔషధాలు వాడిస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్‌ కనిపిస్తోంది. ఈ విషయాన్ని దిల్లీ ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగం ఛైర్మన్‌ అజయ్‌ స్వరూప్‌ వెల్లడించారు. అదే ఇది ఊపిరితిత్తుల్లోకి చేరితో ఛాతిలో నొప్పి, ఊపిరి ఆడకపోవడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నారు. 

దీనిపై అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పలు సూచనలు చేసింది. ఈ ఫంగస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని పేర్కొంది. కానీ, దీనిని ముందుగానే గుర్తించి యాంటీఫంగల్‌ వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వెల్లడించింది.  

చికిత్స ఏమిటీ..?

సమస్య తీవ్రంగా ఉన్నవారిలో యాఫోటెరిసన్‌ బి వంటి యాంటీ ఫంగల్‌ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడతారు. ప్రస్తుతం పుణెలోని ఆసుపత్రుల్లో ఈ ఔషధానికి డిమాండ్‌ ఏర్పడటంతో కొరత నెలకొంది. ప్రస్తుతం పుణెలో నిత్యం దాదాపు 1000 వయల్స్‌ను వినియోగిస్తున్నారు. కేవలం భయంతో వీటికి డిమాండ్‌ పెరిగినట్లు ఆంగ్ల వార్తపత్రిక టైమ్స్‌ఆఫ్‌ఇండియా కథనంలో పేర్కొంది. దీంతోపాటు భారత్‌ సీరమ్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌ అభివృద్ధి చేసిన ‘ఎల్‌ఏఎంబీ’ అనే ఔషధాన్ని కూడా వినియోగిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని