లైంగిక వేధింపుల కేసులను మరుగుపరచలేం

లైంగిక వేధింపుల కేసులను మరుగుపరచడాన్ని తాము సమ్మతించలేమని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్‌లో

Updated : 27 Feb 2021 10:45 IST

సుప్రీం కోర్టు స్పష్టీకరణ 

మాజీ జడ్జిపై విచారణకు ఆదేశం 

దిల్లీ: లైంగిక వేధింపుల కేసులను మరుగుపరచడాన్ని తాము సమ్మతించలేమని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్‌లో ఒక జిల్లా మాజీ జడ్జిపై వచ్చిన ఈ తరహా ఆరోపణలపై అంతర్గతంగా శాఖాపరమైన విచారణ జరగాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సదరు మాజీ జడ్జి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా న్యాయాధికారి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై శాఖాపరమైన విచారణకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మొదట ఇచ్చిన ఫిర్యాదును బాధితురాలు వెనక్కి తీసుకున్నారని, రాజీకి సంసిద్ధత వ్యక్తంచేశారని మాజీ జడ్జి తరఫు న్యాయవాది ఆర్‌.బాలసుబ్రమణ్యం వాదించారు. దీన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రస్తుతం సదరు మాజీ న్యాయమూర్తి ‘దోషి’గానే ఉన్నారని, విచారణను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధపడితే నిర్దోషిగా బయటపడే అవకాశం ఉండొచ్చని తెలిపింది. జూనియర్‌ అధికారిపై ఈ తరహా వ్యవహారశైలి ఒక జడ్జి హోదాకు తగదని వ్యాఖ్యానించింది. హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతికి ఆ జడ్జి పేరు పరిశీలనలో ఉన్న సమయంలోనే ఆయనపై ఈ ఆరోపణలు వచ్చాయన్న బాలసుబ్రమణ్యం వాదనను పరిగణనలోకి తీసుకుంది. అయితే శాఖాపరమైన విచారణకు ఆదేశించే అధికారం హైకోర్టుకు ఉందా అన్నదే తాను ప్రస్తుతం తేల్చాల్సిన అంశమని పేర్కొంది. హైకోర్టుకు ఆ అధికారం ఉందని, విచారణను మాజీ జడ్జి ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేసింది. ‘ఇబ్బందికరమైన పరిస్థితి’ వల్లే ఫిర్యాదుదారు తన ఫిర్యాదును వెనక్కి తీసుకొని ఉంటారని, శాఖపరమైన చర్యలకు అది అడ్డుకాజాలదని తేల్చి చెప్పింది.  

జీవిత భాగస్వామి ప్రతిష్ఠను దెబ్బతీయడం మానసిక క్రూరత్వమే
జీవిత భాగస్వామిని కించపరిచేలా ఫిర్యాదులుచేసి, అతని ప్రతిష్ఠను దెబ్బతీయడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఓ సైనికాధికారి జంటకు విడాకులు మంజూరు చేస్తూ ఇలా వ్యాఖ్యలు చేసింది. ఆ జంట మధ్య బంధం విచ్ఛిన్నం కాగా.. అవి మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే సాధారణ కలహాలేనంటూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. భార్య తనను మానసికంగా వేధిస్తోందని, ఆమె నుంచి విడాకులు ఇప్పించాలంటూ భర్త వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ జంటకు 2006లో వివాహమైంది. కొద్దినెలలు కలిసి ఉన్నారు. మొదటి నుంచే వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. 2007 నుంచే విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తమ దాంపత్య బంధాన్ని పునరుద్ధరించాలని భార్య పిటిషన్‌ వేశారు. సైనిక ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు చేశారు. వాటిపై సైన్యం విచారణకు ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో దంపతుల విద్య, సమాజంలో స్థాయి వంటి అంశాలను చూడాలని సుప్రీం కోర్టు పేర్కొంది. విద్యాధికురాలైన భార్య చేసే ఇలాంటి ఆరోపణల వల్ల భర్త ప్రతిష్ఠకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని తెలిపింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం వల్ల భర్త వృత్తి జీవితంపై ప్రభావం పడిందని వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ తరహా వ్యవహారశైలిని క్షమించాలని ఆశించరాదని పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని