NEET row: నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం.. కీలక సూత్రధారి అరెస్ట్‌!

నీట్‌-యూజీ (2024) పరీక్ష పేపర్‌ లీకేజీలో కీలక సూత్రధారిగా భావిస్తోన్న రాజేశ్‌ రంజన్‌ అనే వ్యక్తిని పట్నాలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

Published : 11 Jul 2024 19:10 IST

లఖ్‌నవూ: నీట్‌-యూజీ (2024) పరీక్షలో అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్‌ లీకేజీలో కీలక సూత్రధారిగా భావిస్తోన్న రాజేశ్‌ రంజన్‌ అనే వ్యక్తిని పట్నాలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం పట్నా, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ నేరానికి సంబంధించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. నిందితుడిని విచారించేందుకుగాను స్థానిక కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో బుధవారం ఇద్దరిని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య పది దాటింది.

కేంద్రమంత్రితో అభ్యర్థుల భేటీ..

నీట్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. కొంత మంది అభ్యర్థులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ అయ్యారు. నీట్‌ పరీక్షపై గందరగోళం, కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యం తద్వారా విద్యా సంవత్సరం మరింత ఆలస్యంగా మొదలుకావడం వంటి అంశాలను చర్చించినట్లు సమాచారం. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున.. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని కేంద్ర మంత్రి చెప్పినట్లు తెలిసింది. నీట్‌ పరీక్ష మరోసారి పెట్టాలని డిమాండ్లు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం లీకేజ్‌ స్థానికంగానే ఉందని చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లోనూ పేపర్లు వ్యాప్తి చెందలేదని పేర్కొంటోంది. మరోవైపు వీటికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపడుతోన్న సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని