Navy: సబ్​మెరైన్ల రహస్య డేటా లీక్.. ముగ్గురు నేవీ అధికారుల అరెస్ట్!

జలాంతర్గాములకు సంబంధించిన రహస్య సమాచారం లీకైనట్లు తేలింది. సబ్‌మెరైన్లకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నావికా దళానికి చెందిన ఓ ఉన్నతాధికారే.....

Published : 26 Oct 2021 23:51 IST

దిల్లీ: జలాంతర్గాములకు సంబంధించిన రహస్య సమాచారం లీకైనట్లు తేలింది. సబ్‌మెరైన్లకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నౌకాదళానికి చెందిన ఓ ఉన్నతాధికారే.. మాజీ అధికారులకు అందించినట్లు వెల్లడైంది. దీంతో ఆ ఉన్నతాధికారి సహా ఇద్దరు మాజీలను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ముంబయిలో పనిచేస్తున్న కమాండర్ స్థాయి అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కిలో క్లాస్ సబ్​మెరైన్​ ఆధునికీకరణకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నేవీ కమాండర్.. విశ్రాంత ఉద్యోగులకు రహస్యంగా చేరవేశారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా అరెస్టయిన వారితో సంబంధాలున్న నేవీ ఉద్యోగులను సీబీఐ ప్రశ్నిస్తోందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. విచారణకు నౌకా దళం నుంచి పూర్తి సహకారం ఉందని తెలిపాయి. ఈ సమాచారాన్ని మాజీ అధికారులు ఎవరికి చేరవేస్తున్నారనే విషయంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించించిన నౌకాదళం

మరోవైపు, నౌకాదళం సైతం ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. వైస్ అడ్మిరల్, రేర్ అడ్మిరల్ స్థాయి అధికారుల నేతృత్వంలో ఈ విచారణకు ఆదేశించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్​లో జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని వీరిని ఆదేశించినట్లు వెల్లడించాయి. త్రివిధ దళాలకు చెందిన అనేక మంది విశ్రాంత ఉద్యోగులపై దర్యాప్తు సంస్థలు నిఘా పెడుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజా అరెస్టులు జరిగాయని వెల్లడించారు. వీరి నుంచి అందిన సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.

పాకిస్థాన్‌కు రహస్యాలు చేరవేస్తూ..

సరిహద్దు భద్రతా దళంలో పనిచేస్తూ (బీఎస్‌ఎఫ్‌) పాకిస్థాన్‌కు గూఢచారిగా మారిన ఓ ఉద్యోగిని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాకు చెందిన మహమ్మద్‌ సాజిద్‌ పదేళ్ల క్రితం 74 బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్‌లో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా వాట్సాప్‌ ద్వారా పాక్‌కు రహస్య, సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడు. అందుకు ప్రతిఫలంగా అతని సోదరుడు వాజిద్, సహచరుడు ఇక్బాల్‌ రషీద్‌ల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నట్టు ఏటీఎస్‌ గుర్తించింది. 2011, 2012 సంవత్సరాలలో సాజిద్‌ 46 రోజుల పాటు పాక్‌లో గడిపినట్టు అతని పాస్‌పోర్టు ద్వారా బయటపడింది. ఈ ఆధారాలు సేకరించిన ఏటీఎస్‌ పోలీసులు.. భుజ్‌లోని బీఎస్‌ఎఫ్‌ కార్యాలయంలోనే అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని