NEET row: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన సీబీఐ

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

Updated : 09 Jul 2024 20:42 IST

NEET Row | దిల్లీ: దేశంలో పెను దుమారం సృష్టించిన నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీక్‌ కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐ (CBI) మరో ఇద్దరిని అరెస్టు చేసింది. బిహార్‌లోని పట్నాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. వీరిలో ఒకరు నీట్ అభ్యర్థి కావడం గమనార్హం. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 11కి చేరినట్లు సీబీఐ అధికారులు మంగళవారం వెల్లడించారు.  అదుపులోకి తీసుకున్న వారిలో నలందకు చెందిన నీట్-యుజీ అభ్యర్థి సన్నీతో పాటు రంజిత్‌ కుమార్‌ అనే విద్యార్థి తండ్రి ఉన్నట్లు అధికారులు తెలిపారు.  ఇప్పటివరకు పేపర్‌ లీక్‌ కేసులో బిహార్‌లో ఎనిమిది మంది, అ లాతూర్‌, గోధ్రాకు చెందిన ఒక్కొక్కరు, కుట్ర చేసినట్లు తేలడంతో దేహ్రాదూన్‌ నుంచి ఒకరిని అరెస్టు చేసినట్లు సీబీఐ పేర్కొంది.

ప్రశ్నపత్రం లీక్‌ నిజం...విస్తృతి ఎంతో తేలాలి

ఇప్పటికే  హజారీబాగ్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా.. అక్కడ కాలిపోయిన ప్రశ్నపత్రాలను బిహార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఆరు ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ అధికారులు నమోదు చేశారు. మరోవైపు, ఈ వ్యవహారంలో దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం విచారించిన సుప్రీంకోర్టు.. నీట్‌ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అన్ని అంశాలను పరిశీలించాక మళ్లీ పరీక్ష నిర్వహించే అంశాన్ని చివరి ఆప్షన్‌గానే భావిస్తామని పేర్కొంది. తిరిగి ఈ కేసును జులై 11కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని