Karti Chidambaram: రూ.50లక్షలు తీసుకుని చైనీయులకు వీసా.. కార్తి చిదంబరంపై కొత్త కేసు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తిపై కేంద్ర దర్యాప్తు సంస్థ మరో కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు ఆయనకు సంబంధించిన పలు

Updated : 18 May 2022 10:25 IST

కౌంట్‌ మర్చిపోయానంటూ.. సోదాలపై కాంగ్రెస్‌ ఎంపీ వ్యంగ్యాస్త్రాలు

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తిపై కేంద్ర దర్యాప్తు సంస్థ మరో కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. అయితే ఈ తనిఖీలపై కార్తి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. తమ ఇంట్లో సీబీఐ రికార్డు స్థాయిలో సోదాలు చేసి ఉంటుంది అంటూ విమర్శించారు.

కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సయమంలో కార్తి రూ.50లక్షలు తీసుకుని 250 మంది చైనా దేశస్థులకు వీసా సదుపాయం కల్పించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ ఆయనపై కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మంగళవారం కార్తికి చెందిన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. చెన్నై సహా ముంబయి, కర్ణాటక, పంజాబ్‌, ఒడిశా, దిల్లీలోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. కార్తి తండ్రి చిదంబరం నివాసంలోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ తనిఖీలపై కార్తి ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు.‘‘కౌంట్‌ మర్చిపోయా.. ఎన్నిసార్లు ఇలాంటి సోదాలు జరిగి ఉంటాయి? బహుశా ఓ రికార్డు అయ్యి ఉంటుంది’’ అని రాసుకొచ్చారు.

కార్తి పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అనుమతులు, ఎయిర్‌సెల్‌ ఒప్పందం విషయాల్లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో సీబీఐ, ఈడీ ఆయనపై పలు కేసులు నమోదు చేశాయి. ఆయన తండ్రి చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈ అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఐఎన్‌ఎక్స్‌ కేసులో 2018లో సీబీఐ కార్తిని అరెస్టు చేయగా.. నెల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని