CBI Raids: యూకో బ్యాంక్‌ IMPS స్కామ్‌.. 67 చోట్ల సీబీఐ సోదాలు

యూకో బ్యాంకులో ఐఎంపీఎస్‌ స్కామ్‌కు సంబంధించిన కేసులో సీబీఐ 67 చోట్ల సోదాలు నిర్వహించింది.

Published : 07 Mar 2024 17:43 IST

దిల్లీ:  యూకో బ్యాంక్‌ (UCO Bank)లో రూ.820 కోట్ల మేర ఐఎంపీఎస్ లావాదేవీల కుంభకోణంపై సీబీఐ (CBI) దర్యాప్తు ముమ్మరం చేసింది.  ఇందులోభాగంగా  రాజస్థాన్‌, మహారాష్ట్రల్లోని 67 చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ వెల్లడించింది. బ్యాంకులో గతేడాది నవంబర్ 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్‌కు చెందిన 41 వేల మందికి పైగా కస్టమర్ల ఖాతాల్లో డబ్బులు జమైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  దీనిపై నవంబర్‌ 21న కేసు నమోదు చేసిన సీబీఐ.. పలుచోట్ల సోదాలు జరిపి కొన్ని ఆధారాలు సేకరించింది.

ఏడు ప్రైవేటు బ్యాంకుల్లోని 14,600 ఖాతాదారుల నుంచి ఐఎంపీఎస్‌ లావాదేవీల ద్వారా యూకో బ్యాంకులోని 41వేల ఖాతాదారులకు తప్పుగా మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఇతర బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి సొమ్మూ కట్‌ అవకుండానే యూకో బ్యాంక్‌ ఖాతాదారుల అకౌంట్లలోకి డబ్బు జమ కావడంపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. ఆ  కూపీ లాగే దిశగా ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో పొరపాటున నగదు జమైన తేదీల్లోనే యూకో బ్యాంకులో వేలాది కొత్త ఖాతాలు తెరుచుకోవడంపై ఆరా తీస్తున్నారు. పొరపాటున తమ ఖాతాల్లో జమ అయిన మొత్తాలను చాలామంది ఇదే అదునుగా విత్‌డ్రా చేసుకొని బ్యాంకుకు తిరిగి చెల్లించని వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

ఇందులోభాగంగా గతేడాది డిసెంబర్‌లో కోల్‌కతా, మంగళూరులలోని యూకో బ్యాంకు అధికారులు, పలువురి ఇళ్లతో పాటు మొత్తం 13 చోట్ల సోదాలు జరిపిన సీబీఐ అధికారులు..  తాజాగా రాజస్థాన్‌, మహారాష్ట్రల్లోని జోధ్‌పుర్‌, జైపూర్‌, జలోర్‌, నాగౌర్‌, బర్మేర్‌, ఫలోడి, పుణెలలో దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా యూకో బ్యాంకు, ఐడీఎఫ్‌సీకి చెందిన 130 నేరారోపణ పత్రాలు, 40 మొబైల్‌ ఫోన్లు, రెండు హార్డ్‌డిస్క్‌లు, ఇంటర్నెట్‌ డాంగిల్‌తో పాటు ఫోరెన్సిక్‌ విశ్లేషణ కోసం 43 డిజిటల్‌ పరికరాలను సీజ్‌ చేసినట్లు తెలిపింది. అలాగే, 30 మంది అనుమానితులను ప్రశ్నించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని