CBI searches: రూ.11కోట్ల నాణేలు అదృశ్యం.. 25చోట్ల సీబీఐ సోదాలు

రాజస్థాన్‌ (Rajasthan)లోని కరౌలీ పట్టణంలో ఓ ఎస్‌బీఐ (SBI) శాఖలో రూ.11కోట్ల విలువైన నాణేలు (Coins) అదృశ్యమైన వ్యవహారంలో సీబీఐ (CBI)....

Updated : 18 Aug 2022 22:36 IST

దిల్లీ: రాజస్థాన్‌ (Rajasthan) కరౌలీ పట్టణంలోని ఓ ఎస్‌బీఐ (SBI) శాఖలో రూ.11కోట్ల విలువైన నాణేలు (Coins) అదృశ్యమైన వ్యవహారంలో సీబీఐ (CBI) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా 25చోట్ల సోదాలు నిర్వహించింది. దిల్లీతో పాటు జైపూర్‌, దౌసా, కరౌలి, సవాయి మధోపూర్‌, అల్వార్‌, ఉదయ్‌పూర్‌, భిల్వారాలోని దాదాపు 15మంది మాజీ బ్యాంకు ఉద్యోగులు, ఇతరులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. గతేడాది ఆగస్టులో కరౌలి జిల్లా మెహందీపూర్‌ బాలాజీ బ్రాంచ్‌లో నగదు నిల్వలో తేడా ఉన్నట్టు ప్రాథమికంగా తేలడంతో అధికారులు లెక్కింపు చేపట్టగా.. రూ.11కోట్ల విలువ చేసే నాణేలు అదృశ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది తమ ఖాతా పుస్తకాల్లో రూ.13కోట్లుగా పేర్కొన్న ఈ నాణేల లెక్కింపు బాధ్యతను జైపూర్‌కు చెందిన  అర్పిత్‌ గూడ్స్‌ క్యారియర్‌ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. 

బ్రాంచ్‌ మేనేజర్‌ హర్‌గోవింద్‌ మీనా సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో మొత్తం 3వేల సంచుల్లో రూ.2కోట్ల విలువైన నాణేలే ఉన్నాయని.. రూ.11కోట్లకు పైగా విలువచేసే నాణేలు మాయమైనట్టు తేలడంతో అధికారులు కంగుతిన్నారు. అయితే, 2021 ఆగస్టు 10న రాత్రి లెక్కింపు చేపడుతున్న ప్రైవేటు వెండర్‌ సిబ్బందిని వారు బస చేస్తున్న గెస్ట్‌ హౌస్‌కు కొందరు సాయుధులు వచ్చి కౌంటింగ్‌ నిలిపేయాలని బెదిరించినట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీంతో రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించిన ఎస్‌బీఐ.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాజస్థాన్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను స్వాధీనం చేసుకున్న సీబీఐ తాజాగా సోదాలు నిర్వహించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని