Fodder scam case: లాలూ యాదవ్‌కు మరో 5 ఏళ్ల జైలు.. రూ.60 లక్షల జరిమానా

బిహార్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన దాణా కుంభకోణంలో చిట్టచివరిది, అయిదోది అయిన డొరండా ఖజానా కేసులో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌(73)కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.....

Published : 21 Feb 2022 15:13 IST

రాంచీ: బిహార్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన దాణా కుంభకోణంలో చిట్టచివరిది, అయిదోది అయిన డొరండా ఖజానా కేసులో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌(73)కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. లాలూతో పాటు మరో 99 మంది నిందితులపై విచారణ జరిపిన రాంచీలోని న్యాయస్థానం జనవరి 29న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. గత మంగళవారం లాలూను దోషిగా తేల్చింది. మరో 46 మందికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 24 మందిని నిర్దోషులుగా పేర్కొంది.

రూ.950 కోట్ల దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో తీర్పులు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతి కేసులోనూ లాలూ ప్రసాద్‌కు జైలు శిక్షలు విధించింది. డొరండా ఖజానా కేసు చివరిది.  నకిలీ బిల్లులతో రూ.139.5 కోట్లను ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా పొందిన ఈ కేసులో మొత్తం 170 మందిపై సీబీఐ అభియోగాలను మోపింది. వీరిలో 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారారు. ఇద్దరు నేరం అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. చివరకు లాలూ మరో 99 మంది నిందితులపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది.

రూ.950 కోట్ల కుంభకోణం..5 కేసులు...

అవిభాజ్య బిహార్‌కు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో రూ.950కోట్ల దాణా కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. 1996 జనవరిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లాలూను నిందితునిగా పేర్కొంటూ 1997 జూన్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత సుదీర్ఘ విచారణ జరిగింది. లాలూతోపాటు బిహార్‌ మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్ర, మాజీ ఎంపీ జగదీశ్‌ శర్మ, అప్పటి ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ ధ్రువ్‌ భగత్‌, పశుసంవర్థక శాఖ అధికారులు తదితరులపై సీబీఐ అభియోగాలు మోపింది. దుమ్కా, దేవ్‌ఘర్‌, ఛాయ్‌బసా ఖజానాల నుంచి నిధుల దుర్వినియోగానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దాణా కుంభకోణంలో మరో దోషిగా తేలిన బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్ర 2019లో మృతి చెందారు. 

* తొలి కేసు... ఛాయ్‌బసా ఖజానా నుంచి రూ.37.70 కోట్లు అక్రమంగా పొందడం. 2013 సెప్టెంబరు 30న తీర్పు వెలువడింది. లాలూ ప్రసాద్‌, జగన్నాథ్‌ మిశ్ర సహా 45 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. లాలూకు అయిదేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో లోక్‌సభ సభ్యునిగా అర్హత కోల్పోయారు. 

* రెండో కేసు... దేవ్‌ఘర్‌ ఖజానా నుంచి రూ.84.5 కోట్లను అక్రమంగా విత్‌డ్రా చేయడం. 2018 జనవరి 6న లాలూకు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష ఖరారు. రూ.5లక్షల జరిమానా. 

* మూడో కేసు.. ఛాయ్‌బసా ఖజానా నుంచి రూ.33.67 కోట్లు అక్రమంగా విత్‌డ్రా. 2018 జనవరి 24న లాలూకు అయిదేళ్ల జైలు శిక్ష ఖరారు. రూ.10 లక్షల జరిమానా. 

* నాలుగో కేసు.. దుమ్కా ఖజానా నుంచి రూ.3.13 కోట్లు అక్రమంగా పొందడం. ఈ కేసులో లాలూకు 2018 మార్చి24న వివిధ సెక్షన్ల కింద 14ఏళ్ల జైలు శిక్ష. రూ.60 లక్షల జరిమానాను న్యాయస్థానం విధించింది. 

* అయిదో కేసు... డొరండా ఖజానా నుంచి నకిలీ బిల్లులతో రూ.139.5కోట్లు పొందడం. ఈ కేసులో లాలూ, మరో 41 మందిని దోషులుగా కోర్టు నిర్ధరించింది. శిక్ష ఖరారు కావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని