అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు

CBI files FIR against Rolls Royce: ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్లకు సంబంధించి భారత ప్రభుత్వాన్ని మోసగించారన్న ఆరోపణలపై రోల్స్‌ రాయిస్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. సంస్థ ప్రతినిధులతో పాటు ఇద్దరు మధ్యవర్తులనూ నిందితులుగా చేర్చింది. 

Published : 29 May 2023 19:23 IST

దిల్లీ: ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలపై బ్రిటిష్‌ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీ రోల్స్‌ రాయిస్‌ (Rolls Royce), ఆ కంపెనీ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌పై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ కోసం హాక్‌ 115 అడ్వాన్స్‌ జెట్‌ ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కాంట్రాక్ట్‌ దక్కించుకునేందుకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. రోల్స్‌ రాయిస్‌ ఇండియా డైరెక్టర్‌ టిమ్‌ జోన్స్‌తో పాటు మధ్యవర్తులు సుధీర్‌ చౌధరి, భాను ఛౌదరి, రోల్స్‌ రాయిస్‌ పీఎల్‌సీ, బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌పై వివిధ సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది.

24 హాక్‌ 115 ఏజీటీల కొనుగోళ్లకు భారత్‌ రోల్స్‌ రాయిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 734.21 మిలియన్‌ బ్రిటిష్‌ పౌండ్లు. అలాగే, 42 ఎయిర్‌ క్రాఫ్ట్‌ల తయారీకి గానూ హిందుస్థాన్‌ ఎరో నాటిక్స్‌కు (HAL) మెటీరియల్‌ సప్లయ్‌ చేయడానికి 308.247 మిలియన్‌ డాలర్లు, లైసెన్స్‌ ఫీజు కింద మరో 7.5 మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ డీల్‌ పూర్తవ్వడానికి గానూ నిందితులు పలువురు ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. అయితే, అవినీతి ఆరోపణల కారణంగా ఈ డీల్‌ నిలిచిపోయింది. దీనిపై 2016లో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. ఆరేళ్ల తర్వాత కేసు నమోదుచేసింది. 2006-07 మధ్య రోల్స్‌ రాయిస్‌ ఇండియా కార్యాలయాలపై ఐటీ శాఖ సర్వే నిర్వహించినప్పుడు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు బయటపడ్డాయని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. అయితే, దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఆ ఆధారాలను నిందితులు ధ్వంసం చేశారని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని