Lalu Prasad Yadav: రైల్వే ఉద్యోగాల కుంభకోణం.. లాలూకు సీబీఐ మరో షాక్!

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సీబీఐ మరో షాక్‌ ఇచ్చింది. భూమికి రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో ఆయన్ను విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి సంపాదించింది.

Published : 13 Jan 2023 22:55 IST

దిల్లీ: ఆర్జేడీ(RJD) అధినేత, బిహార్‌(Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad Yadav)ను పాత కేసులు వెంటాడుతున్నాయి. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసు (Land For Job Case)లో ఆయన్ను విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందినట్లు సీబీఐ (CBI) నేడు వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత పత్రాలను ప్రత్యేక న్యాయస్థానంలో సమర్పించింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జిషీటును ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకునేందుకు.. కేంద్రం నుంచి ప్రాసిక్యూట్ అనుమతి తప్పనిసరని సీబీఐ అధికారులు వెల్లడించారు.

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. గతేడాది అక్టోబరు 7న లాలూతోపాటు ఆయన భార్య రబ్రీదేవి, మరో 14 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. అయితే, ప్రత్యేక న్యాయస్థానం దీన్ని పరిగణనలోకి తీసుకోవడం పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే సీబీఐ తాజాగా కేంద్రం నుంచి విచారణ అనుమతి సంపాదించింది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రస్తుతం దాణా కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సింగపూర్‌ వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందిన ఆయన.. కుమార్తె కిడ్నీ దానంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇదిలా ఉండగా.. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవకతవకల కేసులోనూ దర్యాప్తును సీబీఐ ఇటీవల తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని