Oommen Chandy: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎంకు క్లీన్‌ చిట్‌

లైంగిక వేధింపుల కేసులో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీకి సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ కేసులో ఆయన వ్యతిరేకంగా ఓ మహిళ చేసిన ఆరోపణలకు దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది.

Published : 28 Dec 2022 16:51 IST

తిరువనంతపురం: కేరళ (Kerala)లో సంచలనం సృష్టించిన ‘సోలార్‌ స్కామ్‌’లో ప్రధాన నిందితురాలైన మహిళపై లైంగిక వేధింపుల కేసు నుంచి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ (Oommen Chandy)కి ఊరట లభించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయనకు క్లీన్‌ చిట్ ఇచ్చింది. ఈ మేరకు సీబీఐ (CBI).. కోర్టు రిఫరల్‌ రిపోర్ట్‌ సమర్పించింది.

2012లో ఊమెన్‌ చాందీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘సోలార్‌ కుంభకోణం (solar scam)’ చోటుచేసుకుంది. సోలార్‌ యూనిట్ల ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయల మేర అవకతవకలకు పాల్పడినట్లు యూడీఎఫ్‌ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఓ మహిళ.. తాను లైంగిక వేధింపులకు గురైనట్లు 2013 జులైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఊమెన్‌ చాందీ సహా, కొందరు మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన కేరళ క్రైంబ్రాంచ్‌ పోలీసులు.. చాందీ, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కేసును ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అయితే ఇది రాజకీయంగా తీవ్ర దుమారానికి తెరలేపింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. తాజాగా రిఫరల్‌ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో మాజీ సీఎం చాందీకి వ్యతిరేకంగా సదరు మహిళ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ దర్యాప్తులో తేలినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతేగాక, ఫిర్యాదులో చెప్పినట్లుగా ఆ మహిళ.. చాందీ నివాసానికి వెళ్లినట్లుగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని పేర్కొన్నాయి. దీంతో ఆయనకు ఈ కేసులో సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని