Lalu Prasad Yadav: లాలూకు మరోసారి సీబీఐ షాక్‌..

రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌కు సీబీఐ ఝలక్ ఇచ్చింది.  ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ మళ్లీ విచారణ ప్రారంభించింది. యూపీఏ-1 హయాంలో లాలూ రైల్వే మంత్రిగా పనిచేశారు.  

Updated : 26 Dec 2022 11:41 IST

దిల్లీ: ఆర్జేడీ(RJD) అధినేత, బిహార్‌(Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav)కు గట్టి షాక్‌ తగిలింది. ఆయనపై ఉన్న అవినీతి కేసులో దర్యాప్తును సీబీఐ(CBI) తిరిగి ప్రారంభించింది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూ(JDU)తో ఆర్జేడీ పొత్తు పెట్టుకున్న నెలల వ్యవధిలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

లాలూ యూపీఏ-1 హాయంలో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దానిపై 2018లో సీబీఐ విచారణ ప్రారంభించింది. అయితే దానికి సంబంధించిన విచారణ 2021లో ముగిసింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన కుమారుడు, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, కుమార్తెలు చందా యాదవ్‌, రాగిణి యాదవ్‌ నిందితులుగా ఉన్నారు. 

ఇదిలా ఉంటే, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రస్తుతం దాణా కుంభకోణానికి (Fodder Scam) సంబంధించిన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సింగపూర్‌కు వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందిన ఆయన.. కుమార్తె కిడ్నీ దానంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. మరోపక్క ఈ ఆగస్టులో భాజపాతో బంధం తెంచుకున్న నీతీశ్‌ కుమార్‌.. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమితో జట్టుకట్టారు. ఆ రెండు పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. తేజస్వికి ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని