Mahua Moitra: మహువాపై సీబీఐ విచారణ.. భాజపా ఎంపీ ట్వీట్

తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)పై వచ్చిన ఆరోపణలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారించనుంది. ఈ మేరకు భాజపా ఎంపీ నిశికాంత్ దూబే వెల్లడించారు. 

Published : 08 Nov 2023 18:07 IST

దిల్లీ: రాజకీయంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)పై దర్యాప్తునకు రంగం సిద్ధమవుతోంది.  వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని అవినీతి నిరోధక సంస్థ లోక్‌పాల్‌(Lokpal).. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(CBI)ని ఆదేశించింది. ఈ విషయాన్ని భాజపా ఎంపీ నిశికాంత్ దూబే(Nishikant Dubey) ట్విటర్ వేదికగా వెల్లడించారు.

‘నా ఫిర్యాదు ఆధారంగా మహువా పాల్పడిన అవినీతిపై లోక్‌పాల్‌.. సీబీఐ విచారణకు ఆదేశించింది’ అని దూబే వెల్లడించారు. అయితే దీనిపై ధ్రువీకరణ రావాల్సి ఉంది. అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి మహువా రూ.2 కోట్లతో పాటు ఐఫోన్‌ వంటి ఖరీదైన బహుమతులు తీసుకున్నారని ఇటీవల దూబే.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది.

నీతీశ్‌జీ.. ఇంకా ఎంతగా దిగజారుతారు: ‘జనాభా నియంత్రణ’ వ్యాఖ్యలపై మోదీ ఆగ్రహం

ఈ వ్యవహారం లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీకి చేరడంతో.. ఆమె కొద్దిరోజుల క్రితం దాని ముందు హాజరయ్యారు. అలాగే ఆమె లోక్‌సభ ఐడీని దుబాయ్‌ నుంచి మరొకరు ఉపయోగించారని దూబే ఆరోపించగా.. ఆ లాగిన్ వివరాలు తానే ఇచ్చినట్లు మహువా కూడా అంగీకరించారు. లాగిన్‌ వివరాలను దర్శన్‌కు ఇవ్వటాన్ని మహువా సమర్థించుకున్నారు. తాను మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇతరులకు కూడా ఈ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని