UGC NET: డేట్‌ మార్చి.. పేపర్ స్క్రీన్‌షాట్‌ వైరల్‌ చేసి: యూజీసీ నెట్‌ పేపర్‌ లీక్‌ ఆరోపణలపై సీబీఐ

UGC NET: యూజీసీ నెట్‌ పేపర్‌ లీక్‌ వెనక విస్తృత స్థాయి కుట్ర కోణం లేదని సీబీఐ విచారణలో వెల్లడైంది. 

Updated : 11 Jul 2024 12:34 IST

దిల్లీ: యూజీసీ నెట్ (UGC NET) పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ(CBI) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ ప్రశ్నపత్రం వక్రీకరించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన ఓ విద్యార్థిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. ఈ స్క్రీన్‌షాట్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌ కావడంతో కేంద్ర విద్యాశాఖ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో విస్తృతస్థాయి కుట్ర ఏమీ జరగలేదని సీబీఐ గుర్తించింది. లీకైన ఆ ప్రశ్నపత్రం వక్రీకరించినదని, ఆ స్క్రీన్‌షాట్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడం వెనక ఒక పాఠశాల విద్యార్థి ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఒక యాప్‌ ద్వారా ఈ చర్యకు ఒడిగట్టారని చెప్పారు. దానిపై డేట్‌ను జూన్‌ 17గా మార్పు చేశారని తెలిపారు. తనవద్ద తర్వాత పరీక్ష ప్రశ్నపత్రం కూడా ఉందని నమ్మించి, కొంత డబ్బు సంపాదించేందుకే దానిని వైరల్‌ చేసినట్లు వెల్లడించారు. అది మార్పులు చేసిన పేపర్ అని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు చెప్పారు. అలాగే ఈ వివరాలను సీబీఐ అనధికారికంగా ప్రభుత్వానికి వెల్లడించిందని,  ఆ విద్యార్థిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు.

UGC NET 2024: యూజీసీ నెట్‌-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ

జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు అర్హత కోసం జూన్‌ 18న దేశవ్యాప్తంగా యూజీసీ నెట్‌ పరీక్ష రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతీయ సైబర్‌ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ) చెందిన జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం యూజీసీకి ఓ నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధరించింది. పారదర్శకత, విశ్వసనీయత కోసం ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ సంచలన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షను 9 లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. 

నీట్‌ ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వైరల్‌ కాలేదు!: సీబీఐ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ - యూజీ (NEET) పేపర్‌ లీకేజీ వ్యవహారంపై గురువారం సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ దీనిలోని వివరాలను కొన్ని జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. నీట్ పేపర్ లీక్ విస్తృతస్థాయిలో జరగలేదని, ఒక ప్రాంతానికే పరిమితమని దర్యాప్తు సంస్థ తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు వెల్లడించాయి. బిహార్‌లో ఒక పరీక్ష కేంద్రంలో మాత్రమే పేపర్ లీక్ జరిగిందని, అది కొద్దిమంది విద్యార్థులపై మాత్రమే ప్రభావం చూపిందని సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే లీకైన పేపర్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టలేదని తన నివేదికలో ప్రస్తావించింది. ఇదిలాఉంటే.. కేంద్రం వాదన కూడా ఇదేతరహాలో ఉంది. నీట్‌ (యూజీ)లో మాల్‌ ప్రాక్టీస్‌ జరిగిందనడానికి గానీ, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ధి పొందేలా అక్రమాలు జరిగాయనడానికి గానీ ఎలాంటి ఆధారాల్లేవని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని