Mehul Choksi: మెహుల్‌ చోక్సీపై మరో మూడు కేసులు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్‌ చోక్సీపై సీబీఐ మరో మూడు కేసులు దాఖలు చేసింది. పీఎన్‌బీ, ఐసీఐసీఐ ఫిర్యాదు మేరకు దిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపింది

Published : 16 Dec 2022 23:11 IST

దిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (Punjab National Bank) కుంభకోణంలో ప్రధాన నిందితుడు, భారత్‌ నుంచి పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ( Mehul Choksi)పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) మరో మూడు కేసులు నమోదు చేసింది. మోసం, కుట్రపూరితంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ముంబయిలో కేసు నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, ఐసీఐసీఐ (ICICI) కన్సార్టియం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కన్సార్టియం ఫిర్యాదుల మేరకు మూడు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.1300కోట్లకుపైగా మేర అప్పులు ఎగవేసినట్లు పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు మరోసారి ఫిర్యాదు చేయగా.. రూ.5,564.54 కోట్ల మేర రుణాలను మెహుల్‌ చోక్సీ డైరెక్టర్‌గా ఉన్న గీతాంజలిజెమ్స్‌ సంస్థ చెల్లించ లేదని ఐసీఐసీఐ తన ఫిర్యాదులో పేర్కొంది.

బ్యాంకులను మోసం చేసిన తర్వాత మెహుల్‌ చోక్సీ భారత్‌ నుంచి పరారయ్యాడు. విదేశాల్లో ఉన్న అతడిని తీసుకొచ్చేందుకు భారత్‌ తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరిగా గత ఏడాది డొమినికాలో పోలీసులకు చిక్కిన విషయం తెలుసుకున్న భారత్‌ అధికారులు అతడిని ఇక్కడికి రప్పించేందుకు యత్నించారు. ఈ మేరకు డొమినికాతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ, చివర్లో చోక్సీ కేసును డొమినికన్‌ కోర్టు వాయిదా వేయడంతో, చోక్సీ కోసం వెళ్లిన ప్రైవేటు జెట్‌ వెనక్కి తిరిగి వచ్చేసింది. వివిధ ఆరోగ్య సమస్యలతో చోక్సీ ప్రస్తుతం అక్కడే ఉంటున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు