CBI - Manish Sisodia: మనీశ్‌ సిసోదియాపై అవినీతి ఆరోపణలు... సీబీఐ కొత్త కేసు!

దిల్లీ ఫీడ్‌బ్యాక్‌ విభాగం (FBU)లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)పై CBI మరో కేసు నమోదు చేసింది.

Updated : 16 Mar 2023 15:25 IST

దిల్లీ: దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)పై మరో కేసు నమోదైంది. దిల్లీ ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ (FBU)లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై CBI ఆయనపై కేసు నమోదు చేసింది. చట్టవ్యతిరేకంగా ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ను రూపొందించడం, అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.36 లక్షల నష్టం వాటిల్లిందని సీబీఐ అభియోగాలు మోపింది. దిల్లీలో 2015లో ఆప్‌ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్‌బీయూ యూనిట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

దిల్లీ ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌లో అవకతవకలకు సంబంధించి మనీశ్‌ సిసోదియాతోపాటు విజిలెన్స్‌ సెక్రటరీగా ఉన్న ఐఆర్‌ఎస్‌ అధికారి సుకేశ్‌ కుమార్‌ జైన్‌, ముఖ్యమంత్రికి ప్రత్యేక సలహాదారుగా ఉన్న రిటైర్డ్‌ సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ రాకేశ్‌ కుమార్‌ సిన్హాపైనా సీబీఐ అభియోగాలు మోపింది. ఎఫ్‌బీయూకు రాకేశ్‌ సిన్హా జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరితోపాటు ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ సంయుక్త ఉపడైరెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ పంజ్‌ (ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌కి డిప్యూటీ డైరెక్టర్‌)లతోపాటు ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌లో పని చేస్తోన్న సతీష్‌ కేత్రపాల్‌, గోపాల్‌ మోహన్‌లపైనా కేసు నమోదయ్యింది. ఇక దిల్లీ మద్యం కుంభకోణంలో మనీశ్‌ సిసోదియాను సీబీఐ ఇదివరకే అరెస్టు చేసింది. దాంట్లో జైలుకు వెళ్లిన ఆయన్ను ఇటీవల ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఎక్కువ రోజులు జైల్లో ఉంచేందుకే..

మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్‌ కేసుల్లో భాగంగా ఇప్పటికే జైల్లో ఉన్న మనీశ్‌ సిసోదియాపై సీబీఐ మరో కేసు నమోదు చేయడంపై ఆమ్‌ ఆద్మీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. సుదీర్ఘకాలం పాటు సిసోదియాను కస్టడీలో ఉంచడమే ప్రధానమంత్రి ప్రణాళిక అంటూ ఆయన ఆరోపించారు. ఇది దేశానికి ఎంతో విచారకరమైన విషయమని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని