Odisha Train Tragedy: బాహానగా బజార్‌ రైల్వేస్టేషన్‌కు ‘సీబీఐ’ సీల్‌.. అప్పటివరకు రైళ్లు ఆగవు!

ఒడిశాలో రైలు ప్రమాదం (Odisha Train Tragedy) చోటుచేసుకున్న బాహానగా బజార్‌ స్టేషన్‌కు సీబీఐ (CBI) సీల్‌ వేసింది. ఈ నేపథ్యంలో.. ఈ స్టాప్‌ (Bahanaga Bazar)లో కొన్నిరోజులు ఏ రైళ్లూ ఆగవని రైల్వే అధికారులు శనివారం వెల్లడించారు.

Published : 10 Jun 2023 18:02 IST

భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Tragedy) తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 288 మంది మృతి చెందారు. అయితే, ఇదంతా ఉద్దేశపూర్వకమేనా? దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? వెలికితీసేందుకు సీబీఐ (CBI) ఇప్పటికే రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే దుర్ఘటన చోటుచేసుకున్న బాహానగా బజార్‌ (Bahanaga Bazar) రైల్వేస్టేషన్‌ను తాజాగా సీల్‌ చేసింది. అంతకుముందే స్టేషన్‌ లాగ్‌ బుక్‌, రిలే ప్యానెల్‌, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో.. బాహానగా బజార్ స్టేషన్‌లో ఏ రైళ్లూ ఆగవని రైల్వే అధికారులు శనివారం వెల్లడించారు. సాధారణ రోజుల్లో భద్రక్- బాలేశ్వర్‌, హావ్‌డా- భద్రక్, ఖరగ్‌పూర్- ఖుర్దా రోడ్ తదితర ఏడు ప్రయాణికుల రైళ్లతోపాటు అవసరమైన సందర్భాల్లో గూడ్సు రైళ్లు ఇక్కడ ఆగేవి.

‘లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్న అనంతరం బాహానగా బజార్‌ రైల్వేస్టేషన్‌ను సీబీఐ సీల్‌ చేసింది’ అని రైల్వే అధికారులు తెలిపారు. ‘రిలే ఇంటర్‌లాకింగ్ ప్యానెల్‌ను స్వాధీనం చేసుకున్నందున.. సిగ్నలింగ్‌ వ్యవస్థను నిర్వహించేందుకు స్టేషన్‌ సిబ్బందికి అవకాశం లభించదు. ఈ నేపథ్యంలో.. తదుపరి నోటీసులు వచ్చే వరకు స్టేషన్‌లో ప్రయాణికుల, గూడ్సు రైళ్లు ఆగవు’ అని వెల్లడించారు. ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ’లో మార్పులు చేయడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే శాఖ భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. బాహానగా బజార్ స్టేషన్ మీదుగా రోజూ దాదాపు 170 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మరోవైపు.. ప్రమాద బాధితుల్లో 709 మందికి ఇప్పటికే పరిహారం అందించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని