NSE: ఇలాంటి కుంభకోణాలు జరిగితే భారత్‌కు పెట్టుబడులు వస్తాయా..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌ఎస్‌ఈ కుంభకోణం, హిమాలయ యోగి వ్యవహారంలో దర్యాప్తు ఆలస్యమవుతుండటంపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది

Published : 10 Mar 2022 01:55 IST

ఎన్‌ఎస్ఈ కేసులో ప్రత్యేక కోర్టు ఆగ్రహం

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌ఎస్‌ఈ కుంభకోణం, హిమాలయ యోగి వ్యవహారంలో దర్యాప్తు ఆలస్యమవుతుండటంపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కుంభకోణాలు జరిగితే మన దేశంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? అంటూ ఆగ్రహించింది. ఇందులో సెబీ పాత్రను కూడా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.  

కో లొకేషన్‌ కేసు వ్యవహారంలో ఇటీవల ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్‌ చిత్ర రామకృష్ణ, మాజీ గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్రమణియన్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారణ జరిపింది. ‘‘ఇది మన దేశ ప్రతిష్ఠకు సంబంధించిన వ్యవహారం. ఈ కుంభకోణం విలువ ఎంత ఉంటుంది? ఈ కుంభకోణం కారణంగా మన విశ్వసనీయత ప్రమాదంలో పడింది. ఇలాంటివి జరిగితే భారత్‌లో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? కుంభకోణం వెలుగులోకి వచ్చి ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి. ఇంకా దర్యాప్తు చేస్తున్నామంటే లాభం లేదు. అతి త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలి’’ అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సీబీఐని ఆదేశించారు. ఇక, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీపైనా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఎన్‌ఎస్‌ఈలో జరిగిన అవినీతిపై సెబీ చర్యలు చేపట్టి, బాధ్యులను శిక్షించిందా లేదా అన్నది తెలుసుకోవాలని పేర్కొంది. 

2018లోనే ఈ కో-లొకేషన్‌ కేసు వ్యవహారం బయటపడింది. అయితే ఇటీవల సెబీ విడుదల చేసిన ఓ ఆదేశాల్లో మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ ఓ హిమాలయ యోగి ప్రభావానికి గురయ్యారన్న వార్తతో ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు.. ఇటీవల సెబీ కార్యాలయానికి వెళ్లి కీలక పత్రాలను తీసుకున్నారు. అంతేగాక, చిత్ర, ఆమె సలహాదారు అయిన ఆనంద్ సుబ్రమణియన్‌ను కొన్ని రోజుల పాటు ప్రశ్నించారు. అనంతరం వీరిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు