లాలూ కుమార్తె ఇంటికి సీబీఐ.. Land For Job Caseలో మాజీ సీఎంకు ప్రశ్నలు

ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav).. సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. విపక్షపార్టీలు ప్రధాని మోదీకి లేఖ రాసిన సమయంలోనే ఈ విచారణ జరుగుతుండటం గమనార్హం. 

Published : 07 Mar 2023 12:30 IST

పట్నా: ఆర్జేడీ(RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav)ను మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రశ్నిస్తోంది. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసు (Land For Job Case)లో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ విచారణ లాలూ కుమార్తె మీసా భారతి ఇంట్లో జరుగుతోంది.

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ(UPA)హయాంలో లాలూ( Lalu Prasad Yadav) రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదుచేసింది. బీహార్‌ మాజీ సీఎం లాలూతోపాటు ఆయన భార్య రబ్రీదేవి, మరో 14 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. సోమవారం రబ్రీని ఆమె నివాసంలో ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం లాలూను విచారిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)అరెస్టును ఖండిస్తూ తొమ్మిది మంది విపక్ష పార్టీల నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (modi)కి లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందని లేఖలో ఆరోపించారు.2014లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల్లో అత్యధికం భాజపాయేతర పార్టీలకు చెందినవారేనని లేఖలో విపక్ష నాయకులు పేర్కొన్నారు. ఈ లేఖపై సంతకం చేసిన తొమ్మిది మంది నేతల్లో ఆర్జేడీ నేత, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ కూడా ఉన్నారు. ఈ సమయంలో ఆర్జేడీ అగ్రనేతలను సీబీఐ ప్రశ్నిస్తుండటం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని