Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. రంగంలోకి సీబీఐ

Odisha Train Tragedy: ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని తేల్చేందుకు సీబీఐ (CBI) రంగంలోకి దిగింది.

Updated : 06 Jun 2023 16:36 IST

భువనేశ్వర్‌: యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిశా రైలు దుర్ఘటన (Odisha Train Tragedy)పై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ మొదలుపెట్టింది. మంగళవారం ఉదయం 10 మంది సీబీఐ (CBI) అధికారుల బృందం బాలాసోర్‌లోని ప్రమాదస్థలికి చేరుకుంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి.. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించింది. రాష్ట్ర పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను సీబీఐ పరిశీలించింది. రైల్వే మంత్రిత్వ శాఖ అభ్యర్థన, ఒడిశా ప్రభుత్వ సమ్మతితో... కేంద్ర హోం శాఖ, డిఓపీటీ ఉత్తర్వులకు అనుగుణంగా సీబీఐ కేసు నమోదు చేసింది.

రైలు దుర్ఘటనపై ఒడిశా పోలీసులు (Odisha Police) ఇప్పటికే కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం వంటి అభియోగాలతో ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కాగా.. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు వ్యక్తమైన విషయం తెలిసిందే. రైళ్లు సురక్షితంగా నడవడంలో అత్యంత కీలకమైన ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ’లో మార్పులు చేయడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.

అయితే, ఇది ఉద్దేశపూర్వకమేనా? ప్రమాదం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. విధ్వంసక చర్యకు పాల్పడేందుకే కొందరు వ్యక్తులు.. ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో మార్పు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.  ఎవరో వ్యవస్థలో జోక్యం చేసుకోనిదే మెయిన్‌లైన్‌కు ఖాయం చేసిన రూటును లూప్‌ లైనుకు మార్చడం సాధ్యం కాదని రైల్వే అధికారి ఒకరు తేల్చి చెప్పారు. అందుకే సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు తర్వాతే అసలు వాస్తవాలు బయటకు రానున్నట్లు ఆయన తెలిపారు.

101 మృతదేహాలు ఎవరివో..?

ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 278కి పెరిగినట్లు ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో సగానికి పైగా మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించగా.. ఇంకా 101 మృతదేహాలు ఎవరివనేది తెలియరాలేదు. ఈ మృతదేహాలను గుర్తించేందుకు వారి బంధువులెవరూ రావట్లేదు. దీంతో మృతదేహాలను భద్రపరచడం అధికారులకు, ఆస్పత్రి వర్గాలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో మృతదేహాలను గుర్తించేందుకు ఒడిశా ప్రభుత్వంతో కలిసి, భారతీయ రైల్వే (Indian Railways) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మృతుల ఫొటోలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆ వెబ్‌సైట్‌ల ద్వారా తమ వారి ఆచూకీ గుర్తించవచ్చని భారతీయ రైల్వే ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని