CBI: అమిత్‌ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్‌ సింగ్‌

మణిపుర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మొదలైంది. అధికారుల బృందం ఇంఫాల్‌ చేరుకుందని సీఎం బీరెన్‌ సింగ్‌ వెల్లడించారు.

Published : 27 Sep 2023 19:39 IST

ఇంఫాల్‌:  మణిపుర్‌(Manipur)లో జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల హత్యకు గురైన ఘటనతో అక్కడ మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించేందుకు తమ రాష్ట్రానికి సీబీఐ అధికారుల బృందం చేసుకుందని మణిపుర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌(Biren Singh) వెల్లడించారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ అజయ్ భట్నాగర్‌ సారథ్యంలోని అధికారుల బృందం దర్యాప్తు ప్రారంభించిందన్నారు. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం.. విద్యార్థులను కిడ్నాప్‌ చేసి హత్య చేసిన కేసులో దోషులను అరెస్టు చేసి శిక్షిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారన్నారు. ఇంఫాల్‌లో అడుగుపెట్టిన తర్వాత సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారన్నారు.  అయితే, సీబీఐ బృందం ఎక్కడికి వెళ్లి దర్యాప్తు చేస్తోందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. 

మణిపుర్‌లో మరో దారుణం... అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల హత్య

కొన్ని నెలలుగా జాతుల మధ్య హింసతో రగులుతోన్న మణిపుర్‌లో రెండు నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ విద్యార్థుల మృతదేహాల ఫొటోలు సోమవారం రాత్రి నుంచి.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో రాష్ట్రంలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైతేయ్‌ వర్గానికి చెందిన యువతి (17), యువకుడు (20)లను కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతంలో బంధించి వారిని హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.  అయితే, ఇది కుకీ వర్గానికి చెందిన దుండుగుల పనేనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం బీరెన్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. అక్కడ ప్రస్తుతం ఇంటర్నెట్‌సేవల్ని సైతం నిలిపివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని