Manipur Violence: ‘వెంటనే ఆయుధాలు అప్పగించండి.. లేదో’: అమిత్‌ షా గట్టి వార్నింగ్‌

Manipur Violence: కేంద్రహోం మంత్రి అమిత్‌ షా ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో హింసను ఎగదోస్తున్నవారికి ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

Updated : 01 Jun 2023 15:00 IST

ఇంఫాల్‌: కొన్నిరోజులుగా మండిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur Violence)లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) శాంతిని నెలకొల్పేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మణిపుర్‌లో చెలరేగిన ఘర్షణలను హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందని వెల్లడించారు. అలాగే ఈ హింసకు సంబంధించిన ఆరు కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. మరోపక్క మిలిటెంట్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

‘దాదాపు నెలరోజులుగా మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు(Manipur Violence) చోటుచేసుకుంటున్నాయి. ఘర్షణల్లో తమవారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గత మూడు రోజులుగా నేను ఇంఫాల్, మోరె, చురాచాంద్‌పుర్‌ సహా పలు ప్రాంతాల్లో పర్యటించాను. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా స్థానిక అధికారులతో మాట్లాడాను. ఈ ఘటనలపై దర్యాప్తు జరిపేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిపై త్వరలో ప్రకటన చేస్తాం. అలాగే మణిపుర్ గవర్నర్‌ నేతృత్వంలో పీస్‌ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ ఘటనల వెనక కుట్రలను గుర్తించేందుకు ఉన్నతస్థాయి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాం. ఈ దర్యాప్తు పూర్తి తటస్థంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. అలాగే మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల పరిహారాన్ని అందిస్తాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హోం శాఖకు చెందిన చెందిన ఉన్నతస్థాయి అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తారు’ అని మంత్రి వెల్లడించారు. 

అలాగే ఎవరి చెంత అయినా ఆయుధాలు ఉన్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని అమిత్‌ షా(Amit Shah) హెచ్చరించారు. ‘నకిలీ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌరులను అభ్యర్థిస్తున్నాను. ఆయుధాలు కలిగి ఉన్నవారు వెంటనే వాటిని పోలీసులకు అప్పగించాలి. రేపటి నుంచి కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎవరివద్ద అయినా ఆయుధాలు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవు’ అని చెప్పారు.

మణిపుర్‌(Manipur) గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్‌ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఘర్షణకు దారితీసింది. మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే. మణిపుర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువ. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ హోదా విషయంలో మెయిటీలు, గిరిజనులకు మధ్య జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. అలాగే ఆయుధాలతో తిరుగుతున్న పదుల సంఖ్యలో మిలిటెంట్లను భద్రతా బలగాలు కాల్చిచంపినట్లు ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ప్రకటించారు.

భారీ మార్పు..మణిపుర్‌కు కొత్త పోలీస్‌ చీఫ్

మణిపుర్ ఘర్షణల నేపథ్యంలో పోలీసు విభాగంలో భారీ మార్పుచోటుచేసుకుంది. త్రిపుర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాజీవ్‌ సింగ్‌ను కేంద్రం మణిపుర్ డీజీపీగా నియమించింది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న పి. దౌంగెల్‌ను హోంశాఖకు బదిలీ చేసింది. రాజీవ్‌ సింగ్.. గతంలో సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా పనిచేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో మే 29న ఆయన్ను ఈ రాష్ట్రానికి ప్రత్యేక అధికారిగా నియమించింది. తాజాగా డీజీపీగా బాధ్యతలు అప్పగించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని