CBI: సీబీఐ భారత ప్రభుత్వ అజమాయిషీలోని సంస్థే

భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ‘సీబీఐ’...కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోని సంస్థేనని సుప్రీంకోర్టు విస్పష్టం చేసింది.

Published : 11 Jul 2024 03:57 IST

సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
కేంద్రం, దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన పశ్చిమ బెంగాల్‌ సర్కారు పిటిషన్‌కు అనుమతి

దిల్లీ: భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ‘సీబీఐ’...కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోని సంస్థేనని సుప్రీంకోర్టు విస్పష్టం చేసింది. తమ రాష్ట్రం పరిధిలోని కేసుల దర్యాప్తునకు సమ్మతిని ఉపసంహరించుకున్నప్పటికీ సీబీఐ జోక్యం చేసుకొంటూ పదే పదే ఒత్తిడి తెస్తోందన్న పశ్చిమ బెంగాల్‌ సర్కారు పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. ఈ వ్యాజ్యాన్ని కొనసాగించడంలో కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతా సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది. బెంగాల్‌ ప్రభుత్వ పిటిషన్‌ను ఆగస్టు 13నాటి విచారణ జాబితాలో చేర్చుతున్నట్లు తెలిపింది. 

తమ రాష్ట్ర ప్రాదేశిక పరిధిలో కేసుల దర్యాప్తునకు, దాడులు చేయడానికి సీబీఐకి అవకాశం కల్పించే సాధారణ సమ్మతి (జనరల్‌ కన్సెంట్‌)ని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 2018 నవంబరు 16న ఉపసంహరించుకుంది. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమ రాష్ట్రం పరిధిలోని విషయాలపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదుతో పాటు దర్యాప్తులూ చేస్తోందంటూ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనీ, దానిపై తమ అజమాయిషీ ఏమీ ఉండదని కేంద్రం పేర్కొంటూ బెంగాల్‌ ప్రభుత్వ పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోరింది. అయితే, దిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(డీఎస్‌పీఈ) చట్టం-1946 ప్రకారం ఆవిర్భవించిన సీబీఐపై ఆజమాయిషీ కేంద్ర ప్రభుత్వానిదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో స్వతంత్రంగా వ్యవహరించడం వేరు, సంస్థపై అజమాయిషీని కలిగి ఉండడం వేరని తెలిపింది. భారత దేశ భౌగోళిక పరిధుల అవతల కూడా కేంద్రం అనుమతితోనే సీబీఐ దర్యాప్తులు చేపడుతుందని గుర్తుచేసింది. డీఎస్‌పీఈ చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం...మన దేశంలోని ఏదైనా రాష్ట్రం తమ ప్రాదేశిక పరిధుల్లో ద]ర్యాప్తునకు అనుమతివ్వకపోతే సీబీఐకి అటువంటి అధికారం ఉండదని పేర్కొంది. రాజ్యాంగ అధికరణం 131 ప్రకారం భారత ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని 74 పేజీల తీర్పులో వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని