CBSE: పదో తరగతి మార్కులను ఎలా ఇస్తారంటే?

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ తాజాగా తీసుకున్న.....

Published : 26 May 2021 17:26 IST

FAQ విడుదల చేసిన బోర్డు

దిల్లీ: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ తాజాగా తీసుకున్న నిర్ణయంతో మార్కుల కేటాయింపులో మరింత జాప్యం నెలకొంది. జూన్‌ 11 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, 20న ఫలితాలు వెల్లడిస్తామని ఇంతకుముందు ప్రకటించిన సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఇటీవలే ఆ గడువును పెంచింది. జూన్‌ 30 నాటికి ఆయా పాఠశాలలు అంతర్గత మదింపు ఆధారంగా చేసిన మార్కుల కేటాయింపును పూర్తి చేసి జాబితాలను పంపాలని ఆదేశించింది. అయితే, సీబీఎస్‌ఈ మార్కుల కేటాయింపుపై విద్యార్థులు/ తల్లిదండ్రులు/ ఉపాధ్యాయుల్లో వ్యక్తమయ్యే పలు సందేహాలను నివృత్తి చేసేందుకు ఎఫ్‌ఏక్యూ (తరచూ వచ్చే సందేహాలు)ను సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేసింది.

* సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలను ఎలా ప్రకటిస్తారు? 

బోర్డు రూపొందించిన ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా విధానం ఆధారంగా పదో తరగతి ఫలితాలను ప్రకటిస్తారు. 

* ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా ప్రకటించిన ఫలితాలతో ఏ విద్యార్థి అయినా సంతృప్తి చెందకపోతే.. అలాంటి వారికి సీబీఎస్‌ఈ ఎలాంటి అవకాశం కల్పిస్తుంది?

ఎవరైతే బోర్డు కేటాయించిన మార్కులతో సంతృప్తి చెందరో.. వారంతా కరోనాతో నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత సీబీఎస్‌ఈ నిర్వహించే పరీక్షలు రాసేందుకు వీలు కల్పిస్తారు.

* పాఠశాలలు డేటా అప్‌లోడ్‌ చేసేందుకు గడువు జూన్‌ 11. పదో తరగతి పరీక్షల రద్దు నేపథ్యంలో దీన్ని పొడిగించే అవకాశం ఏమైనా ఉందా?

డేటా అప్‌లోడ్‌ చేసేందుకు గడువును జూన్‌ 30 వరకు పొడిగించాం.

* విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా సీబీఎస్‌ఈ కేటాయించిన మార్కులు ఎక్కడ అందుబాటులో ఉంటాయి?

బోర్డు వెబ్‌సైట్‌లో ప్రతి స్కూల్‌కు ఒక లాగిన్‌ ఉంటుంది. ఆ స్కూల్‌ లాగిన్‌ అకౌంట్‌లో ఆయా పాఠశాలల విద్యార్థులకు సబ్జెక్టులవారీగా వచ్చిన మార్కుల వివరాలు అందుబాటులో ఉంటాయి.

*  అసెస్‌మెంట్‌కు గైర్హాజరైన విద్యార్థుల విషయంలో పాఠశాలలు ఎలా వ్యవహరించాలి?

పాఠశాలలు నిర్వహించే ఏ అసెస్‌మెంట్‌కూ హాజరుకాని విద్యార్థులకు ఆయా పాఠశాలలు ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌లో గానీ లేదా టెలీఫోన్‌లో గానీ ఆ విద్యార్థిని మదింపు చేయవచ్చు. ఆ అంశాలను ధ్రువీకరించేందుకు వీలుగా డాక్యుమెంటరీ సాక్ష్యాలను రికార్డు చేయాల్సి ఉంటుంది.

* బోర్డు ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు ఆ పరీక్ష కాపీలను చూడాలనుకున్నా.. ఆ మార్కులను వెరిఫై చేయాలనుకున్నా పాఠశాలలు ఏం చేయాలి?

ఈ సంవత్సరానికైతే అలాంటి సదుపాయం ఏమీ లేదు.

* పాఠశాలల అంతర్గత మదింపు బోర్డు ఆదేశాలకు అనుగుణంగా లేనట్టయితే మార్కులను ఎలా కేటాయిస్తారు?

విద్యార్థులు రాసిన పరీక్షల ఆధారంగా మార్కులను కమిటీయే ఖరారు చేస్తుంది. ఆ మదింపు బోర్డు గైడ్‌లైన్స్‌ ప్రకారం ఉన్నాయో, లేదో నిర్ధారణ చేసుకొని వాటిని పరిగణనలోకి తీసుకొంటారు. 

మరోవైపు, దేశంలో కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే, పదో తరగతి పరీక్షలకు మార్కుల మదింపు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. బోర్డు కొత్త విధానం ప్రకారం.. ప్రతి సబ్జెక్టుకు వంద మార్కులుంటాయి. అందులో ఇంటర్నల్ (అంతర్గత) మార్కులు 20 కాగా.. మిగతా 80 మార్కులను ఏడాది మొత్తంలో జరిగిన వివిధ పరీక్షలలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉంటాయి. ఫలితాలను ఖరారు చేసేందుకు ప్రిన్సిపల్, ఏడుగురు ఉపాధ్యాయులతో కమిటీని ఏర్పాటు చేయాలని పాఠశాలలను బోర్డు ఆదేశించింది. సొంత పాఠశాల నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు(గణితం, సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, రెండు భాషలకు చెందినవారు) కమిటీలో ఉండాలని తెలిపింది. మిగతా ఇద్దరు ఉపాధ్యాయులను పొరుగు పాఠశాలలకు చెందిన వారిని కమిటీలో బాహ్య సభ్యులుగా నియమించుకోవాలని సూచించింది. మార్కుల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని