టీకా చాలా సురక్షితం

కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవేనని సీసీఎంబీ డైరెక్టర్‌ డా.రాకేశ్‌ మిశ్రా తెలిపారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాతే వాటికి అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు....

Published : 30 Jan 2021 18:37 IST

సీసీఎంబీ డైరెక్టర్‌తో ముఖాముఖి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవేనని సీసీఎంబీ డైరెక్టర్‌ డా.రాకేశ్‌ మిశ్రా తెలిపారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాతే వాటికి అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. సీసీఎంబీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేసిన పరిశోధనల్లో శాకాహారం తీసుకునేవారిలో తక్కువ మంది కరోనా బారిన పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని పేర్కొన్నారు. అయితే దీనిపై మరింత పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొంటున్న రాకేశ్‌ మిశ్రాతో ముఖాముఖి.

శాకాహారులు, పొగతాగేవారిలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. శాకాహారుల్లో కరోనా వ్యాప్తి ప్రభావం ఉందా? లేదా? అధ్యయనాల్లో ఏం తేలింది?

రాకేశ్ మిశ్రా: దేశవ్యాప్తంగా సీఎస్‌ఐఆర్‌ ఉద్యోగుల్లో సీరో సర్వే ద్వారా పాజిటివిటీ రేటును తెలుసుకున్నాం. శాకాహారులు, పొగతాగేవారిలో యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు గుర్తించాం. కానీ ఈ అంశంపై అవగాహనకు వచ్చేందుకు ఇది పూర్తిస్థాయి అధ్యయన నివేదిక కాదు. మరింత సమాచారం, మరిన్ని విష్లేషణలు చేయాల్సిన అవసరం ఉంది.

ఈ అంశంపై ఎన్ని రోజుల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. నమూనా పరిణామం ఎంత?
రాకేశ్ మిశ్రా: ఈ ప్రాజెక్టు ఐదారు నెలల క్రితమే ప్రారంభమైంది. నమూనా పరిణామంలో ఏడెనిమిది వేల మంది ఉన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. చాలా కేసుల్లో రెండు విడతల సీరో సర్వే విజయవంతంగా పూర్తయ్యింది. ఈ అధ్యయనం దీర్ఘకాలికంగా ఉంటుంది. జన్యుక్రమాలు, ఇతర వ్యాధులకు సంబంధించిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని మరిన్ని వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు సుమారు 10 నుంచి 15 ఏళ్లు పట్టొచ్చు.

మీరు హైదరాబాద్‌ ప్రజలపై పరిశోధన చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా గుర్తించిన అంశాలేవి?
రాకేశ్ మిశ్రా: సర్వే నమూనాలను జాతీయ పోషకాహార సంస్థ సహకారంతో పూర్తిచేశాం. హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన ఈ సర్వేలో సీరో ప్రొవిలెన్స్‌ గురించి అడిగాం. ప్రజలు కరోనా బారిన పడ్డారా లేదా? ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారా? ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారా?వైరస్ లక్షణాలు కనిపించాయా లేదా అనే అంశాలపై సీరో ప్రొవిలెన్స్‌లో తెలుసుకున్నాం. కానీ చాలా మందిలో యాంటీబాడీలు కనిపించాయి. ఈ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లో రోగనిరోధకత ఏమేర ఉన్నదనే విషయం మాకు తెలిసింది. తద్వారా ఎంతవరకు వ్యాక్సినేషన్‌ అవసరముందనే అంశంపై స్పష్టత వచ్చింది.

వ్యాక్సిన్ల పట్ల కొంతమందిలో ఆందోళన నెలకొంది. నిజంగా టీకా హానికరమా?
రాకేశ్ మిశ్రా: టీకా ఏమాత్రం హానికరం కాదు. సమాచార లోపంతోనే ఇలా జరుగుతోందని భావిస్తున్నా. ఇప్పటివరకు సుమారు 20 లక్షల మందికిపైగా టీకా వేయించుకున్నారు. ఎవరికి ఏమీ కాలేదు. ఒకట్రెండు ఘటనలు జరిగినా.. వాటికి ఇతర కారణాలున్నాయి. కొందరికి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటం వల్ల అలా జరిగి ఉండొచ్చు. మనకు అందుబాటులో ఉన్న సమాచారం.. మొదటి, రెండు విడతల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా చూస్తే టీకా చాలా సురక్షితమైనది. అయితే అది వైరస్‌ నుంచి మనల్ని ఎంతకాలం రక్షిస్తుందనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రజలు మాస్కు తప్పనిసరిగా ధరించాలి.

ఇవీ చదవండి...

‘కొత్తరకం’పై ఆందోళన వద్దు..! సీసీఎంబీ

అగ్రరాజ్యానికి ‘కొత్తరకం’ కలవరం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని