Parliament: శీతాకాల సమావేశాలు.. లోక్‌సభ, రాజ్యసభ ఒకేసారి..!

ఈ ఏడాది పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను నవంబరు 29 నుంచి డిసెంబరు 23 వరకు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసింది. గత ఏడాదిన్నర

Published : 08 Nov 2021 20:26 IST

నవంబరు 29 నుంచి సమావేశాల నిర్వహణ

దిల్లీ: ఈ ఏడాది పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను నవంబరు 29 నుంచి డిసెంబరు 23 వరకు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసింది. గత ఏడాదిన్నర కాలంలో జరిగిన సమావేశాల మాదిరిగానే కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ శీతాకాల సమావేశాలు జరుగుతాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన దృష్ట్యా లోక్‌సభ, రాజ్యసభ ఏకకాలంలోనే సమావేశమవుతాయని పేర్కొన్నాయి. ఈ మేరకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ నేతృత్వంలోని జరిగిన కేబినెట్‌ కమిటీ భేటీలో ఈ సిఫార్సులపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. 

కరోనా ఉద్ధృతి కారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలను గత ఏడాది నిర్వహించలేదు. బడ్జెట్‌, వర్షాకాల సెషన్లు జరిగినా కొద్ది రోజుల్లోనే ముగించారు. అంతేగాక, ఆ సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభల సమావేశాలను వేర్వేరు సమయాల్లో నిర్వహించారు. పార్లమెంటు భవనంలో ఒకేసారి అందరూ గుమిగూడకుండా భౌతిక దూరం పాటించడం కోసం ఈ విధమైన ఏర్పాటు చేశారు. 

అయితే శీతాకాల సమావేశాల్లో మాత్రం ఉభయ సభలు ఒకేసారి భేటీ అవుతాయని సదరు వర్గాలు వెల్లడించాయి. సభ్యులందరూ తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేయనున్నారు. పార్లమెంట్‌కు వచ్చేవారు(ఎంపీలతో కలిపి) తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సి ఉంటుంది. అంతేగాక, సమావేశాలకు ముందు సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

ఈ సమావేశాల్లో ఉభయ సభలు సుమారుగా 20 సార్లు భేటీ కానున్నాయి. రాజకీయంగా కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ సహా అయిదు రాష్ట్రాలకు మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి ముందుగా నిర్వహిస్తున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల జులై 19 నుంచి ఆగస్టు 11 వరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించగా.. పెగాసస్‌ వ్యవహారం, సాగు చట్టాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. రాబోయే సమావేశాల్లో సాగు చట్టాలతో పాటు పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, లఖింపుర్‌ ఖేరీ ఘటన తదితర అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశాలున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని